నవమాసాలు మోసి, కని, అల్లారుముద్దుగా పెంచిన కొడుకుని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసింది. కర్రతో తలపై బలంగా కొట్టి దారుణంగా కొట్టి చంపేసింది. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా చెబుతున్నారు. ప్రియుడితో కలిసి కన్న కొడుకునే కడతేర్చింది ఈ మహాతల్లి. తుచ్యమైన క్షణిక సుఖం కోసం ఎదిగొచ్చిన కొడుకుని కడుపున పెట్టుకుంది. తమ చీకటి బంధాన్ని ప్రశ్నించడమే అతను చేసిన పాపం అయిపోయింది. నువ్వు వివాహేతర సంబంధం ఎలా పెట్టుకుంటావంటూ గొడవ పడుతున్నాడని కొట్టి చంపేసింది. కొడుకు కంటే ఆమెకు ప్రియుడితో బంధమే ఎక్కవ అయిపోయింది. ఈ ఘటన ఎక్కడి జరిగింది? అనే పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఈ అత్యంత దారుణమైన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో జరిగింది. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన దాయమ్మకు హన్వాడ మండలం టంకర గ్రామానికి చెందిన పాపయ్యతో 30 ఏళ్ల క్రిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు(29). కుమార్తెలకు వివాహం జరిగిపోయింది. పదేళ్ల కిందటే పాపయ్య మరణించాడు. అప్పటి నుంచి దాయమ్మ- కొడుకు వెంకటేశ్ కలిసి ఉంటున్నారు. పాపయ్య మరణం తర్వాత దాయమ్మకు అదే ఊరికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారి మధ్య పరిచయం కాస్తా అక్రమ సంబంధానికి దారి తీసింది. కొన్నాళ్ల పాటు వారి మధ్య చీకటి సంబంధం సజావుగా సాగింది.
అయితే కొన్నాళ్లకు కుమారుడు వెంకటేశ్ కు ఈ విషయం తెలిసింది. అప్పటి నుంచి ఇటు తల్లి దాయమ్మతో, అటు ఆమె ప్రియుడు శ్రీనివాస్ తో గొడవలు పడుతూ ఉన్నాడు. అయితే వెంకటేశ్ ఉంటే వారి మధ్య బంధం సజావుగా సగదని వాళ్లు భావించారు. ఎలాగైన అతని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చారు. అందుకు దాయమ్మ కూడా అంగీకరించింది. వెంకటేశ్ మద్యం తాగే అలవాటు ఉంది. అతని వ్యసనాన్నే వారు ఆసరాగా మార్చుకున్నారు. ఓ రోజు రాత్రి అతనికి ఫుల్లుగా మద్యం తాపించారు. వెంకటేశ్ మద్యం మత్తులో ఇంట్లో పడుండగా.. కర్రతో అతని తలపై బలంగా కొట్టారు. వాళ్లు కొట్టిన దెబ్బలకు వెంకటేశ్ అక్కడికక్కడే మరణించాడు. గుట్టుచప్పుడు కాకుండా ఆ శవాన్ని ఇంటి సమీపంలోని మోతుకుల కుంటలో పడేశారు.
వెంకటేశ్ మృతదేహాన్ని మాయం చేయడంలో దాయమ్మ- శ్రీనివాస్‌లకు.. శ్రీనివాస్ అల్లుడు కూడా సహాయం చేశాడు. తర్వాత తన కొడుకు కనిపించండం లేదంటూ దాయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలిస్తున్న సమయంలోనే ఎవరికీ తెలియకుండా దాయమ్మ ఊరు విడిచి పారిపోయింది. ఆమె తర్వాత శ్రీనివాస్, నర్సింహులు కూడా ఊరు నుంచి కనిపించకుండా వెళ్లిపోయారు. తర్వాత మోతుకు కుంటలో వెంకటేశ్ మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. శ్రీనివాస్‌తో సంబంధం కోసం కన్న కొడుకుని దాయమ్మ హత్య చేసిందని తెలిసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.