నేటి కాలంలో ప్రేమ పేరుతో ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రేమిస్తున్నామని వెంటపడడం, కాదంటే హత్యలు చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ దుర్మార్గుడు నమ్మించి మోసం చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అది మహబూబ్ నగర్ జిల్లా ఖిల్లాగణపురం మండలం మానాజీపేట. ఇదే గ్రామానికి చెందిన బత్తిని శ్రీశైలం అనే యువకుడు 2017లో హైదరాబాద్ లో డిగ్రీ చదువుకునే రోజుల్లో కాటేదాన్ కు చెందిన సాయి ప్రియ అనే యువతి పరిచయం అయింది.
అప్పటి నుంచి శ్రీశైలం సాయి ప్రియను ప్రేమించాలని వెంటపడుతున్నాడు. దీంతో ఇతని ప్రవర్తనపై విసుగిపోయిన సాయి ప్రియ తల్లిదండ్రులకు చెప్పింది. కోపంతో ఊగిపోయిన ఆ యువతి తల్లిదండ్రులు ఆ యువకుడికి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. అయినా మనోడి యవ్వారంలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే ఇటీవల శ్రీశైలం సాయి ప్రియకు ఫోన్ చేసి.. నీతో మాట్లాడాలని, మత్పూర్ కు రావాలంటూ కబురు పంపాడు. మనోడి మాటను విన్న సాయిప్రియ ఈ నెల 5న హైదరాబాద్ నుంచి నేరుగా శ్రీశైలం చెప్పిన చోటకు చేరుకుంది. అక్కడికి వెళ్లగానే ఇద్దరు బైక్ పై మానాజీపేటలోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడికి చేరుకున్నాక శ్రీశైలం.. నిన్ను ప్రేమిస్తున్నానని, నన్ను పెళ్లి చేసుకోవాలని సాయి ప్రియను మరోసారి కోరాడు.
దీంతో ఆ యువతి మరోసారి ఇతగాడి ప్రేమను నిరాకరించింది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య కాస్త గొడవ రాజుకుంది. ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఇక కోపంతో ఊగిపోయిన శ్రీశైలం సాయిప్రియ గొంతు పిసికి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమె డెడ్ బాడీని స్నేహితుల సాయంతో గుంత తవ్వి అందులో పూడ్చిపెట్టారు. అయితే రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో సాయి ప్రియ తల్లిదండ్రులు శ్రీశైలంపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు శ్రీశైలంను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పెట్టాడు. నేనే హత్య చేసి పూడ్చి పెట్టానని తెలపడంతో సాయి ప్రియ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ప్రేమించలేదని యువతిని హత్య చేసిన ఈ దుర్మార్గుడి దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.