వారిది ఓ మధ్యతరగతి కుటుంబం. తల్లి కష్టం చూడలేక.. తామూ కష్టపడి కుటుంబాన్ని నడిపిస్తు, అమ్మకు చేదోడువాదోడుగా ఉంటున్నారు ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు. చిన్న కూతురు మిషన్ కుట్టుతుంటే.. పెద్ద కూతురు సాయి ప్రసన్న స్థానిక అయ్యప్ప ఆలయంలో పనిచేసేది. ఇక కొడుకు విజయవాడలో గుమాస్తాగా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే పెద్ద కూతురు సాయిప్రసన్నకు పెళ్లి సంబంధం కుదిరింది. దాంతో ఆ ఇంట్లో ఆనందం వెళ్లివిరిసింది. కూతురు పెళ్లి చేసి ఓ బాధ్యతను తీర్చుకుందాం అనుకున్న ఆ తల్లికి తీరని శోకాన్ని మిగిల్చింది. స్థానికంగా కన్నీరు పెట్టిస్తున్న ఈ సంఘటన వైరా మున్సిపాలిటీలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైరా పట్టణం 3వ వార్డు మున్సిపాలిటీకి చెందిన తాళ్లూరి చంద్రకళ తన ముగ్గురు సంతానంతో జీవిస్తోంది. తన పెద్ద కూతురు సాయిప్రసన్న(22)కు ఇటీవలే ఖమ్మం పట్టణానికి చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం కూడా జరిగింది. మరికొద్ది రోజుల్లోనే పెళ్లి కూడా నిశ్చయించుకున్నారు ఇరు కుటుంబాల వారు. ఈ క్రమంలోనే బుధవారం అయ్యప్ప ఆలయంలో మధ్యాహ్నానం వరకు పనిచేసింది. ఆ తర్వాత తల్లి చంద్రకళ పనిచేసే కిరాణా షాప్ వద్దకు వచ్చి తల్లితో మాట్లాడి ఇంటికి వెళ్లింది. ఏం జరిందో ఏమో కానీ.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దాంతో కొద్దిరోజుల్లో పెళ్లి కూతురుగా చూడాలి అనుకున్న సాయిప్రసన్నను ఇలా చూడటంతో తల్లి కన్నీరు మున్నీరు గా విలపించింది. ఆమె బాధను చూపరులను కూడా కన్నీరు పెట్టించింది. అయితే ఆత్మహత్యకు గల ఆధారాలు ఏమీ లభించలేదు. దాంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.