సినిమాలు యువతపై తీవ్ర ప్రభావాన్నిచూపిస్తున్నాయి. హీరోలు వేసుకున్న డ్రెస్‌ల దగ్గర నుండి స్టైల్స్ వరకు వారిని అనుకరిస్తుంటారు. సినిమా చూశాక.. వారిలా ఫేమస్ కావాలని చిత్ర, విచిత్ర వేషాలు వేస్తుంటారు. ఇవన్నీ శ్రుతిమించనంత వరకు బాగానే ఉంటాయి. కానీ ఈ సినిమా పిచ్చి తలకెక్కిచుకొని, తోచిందల్లా చేస్తే చిక్కులు ఎదుర్కొక తప్పదు. ఈ సినిమా చూసి ఫేమస్ కావడం కోసం స్నేహితుడ్నే బలితీసుకున్నారు ముగ్గురు యువకులు. హైదరాబాద్ పాతబస్తీలో జియాగూడలో గత నెల 22న నడిరోడ్డుపై దారుణ హత్య జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు చేధించారు
ఈ ఘటనలో సాయినాథ్ అనే యువకుడు మృతి చెందాడు. స్నేహితులే అతడిని బలిగొన్నారని పోలీసులు తెలిపారు. నిందితులు ఆకాశ్, సోను, టిల్లులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగుచూశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయినాథ్.. నిందితుల్లో ఒకరైన ఆకాశ్ చిన్ననాటి స్నేహితులు. డబ్బుల విషయంలో వీరిద్దరికీ పలుమార్లు గొడవలు జరిగాయి. ఇది అవమానంగా భావించిన ఆకాశ్, మరో ఇద్దరితో కలిసి సాయినాథ్ ను మట్టుపెట్టేందుకు పథకం వేసుకున్నారు.
కెజిఎఫ్ రాఖీభాయ్‌లా గ్యాంగ్ స్టర్ అవ్వాలని అనుకున్నారు. జనం మధ్యన చంపేస్తే, గ్యాంగ్ స్టర్లమవుతామని, అప్పుడు ఫేమస్ అవుతామని, అందరూ మనల్ని చూసి భయపడతారని భావించిన ఆ ముగ్గురు పక్కా ప్రణాళికతో కాపుకాచి సాయినాథ్ ను హత్య చేశారు. జియాగూడ నుండి పీలి మండవ్ శివాలయం సమీపానికి సాయినాథ్ రాగానే.. వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. బండి మీద నుండి కింద పడిపోగానే.. కొడవలి, కత్తి, ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేయడంతో అతడు చనిపోయాడు. సినిమాల ప్రభావం యువతపై చెడు ప్రభావం చూపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.