ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రేమ పేరుతో ఆడవాళ్లకు వల వేసి వాళ్ల జీవితాలను నాశనం చేశాడు. వారి ప్రైవేట్ వీడియోలు తీసి దారుణానికి ఒడిగట్టాడు. సదరు ఆడవాళ్లతో తన అవసరం తీరిపోతే.. వారి వీడియోలను మిత్రులకు పంపటం మొదలుపెట్టాడు. అంతేకాదు! వాటిని సోషల్ మీడియాలో కూడా షేర్ చేయసాగాడు. చివరకు పాపం పండి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన కేరళలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కేరళ, చెమ్మారుతి ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఆకాశ్ ఓ ప్రైవేట్ బస్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.
కొన్ని నెలల క్రితం ఓ బాలికతో అతడు పరిచయం పెంచుకున్నాడు. తర్వాత బాలికను ప్రేమిస్తున్నానంటూ మాయ మాటలు చెప్పాడు. దీంతో సదరు బాలిక ఆకాశ్‌ను గుడ్డిగా నమ్మింది. అతడితో పీకల్లోతు ప్రేమలో పడిపోయింది. బాలిక అతడ్ని బాగా నమ్మటం మొదలుపెట్టిన తర్వాత యువకుడు తన పాడు బుద్ధి బయటపెట్టాడు. బాలికతో ఏకాంతంగా గడిపాడు. ఏకాంత క్షణాలను మొత్తం వీడియోలు తీశాడు. బాలికతో తన అవసరం తీరిపోయిన తర్వాత ఆమెను దూరం పెడుతూ వచ్చాడు. బాలికకు సంబంధించిన వీడియోలు తన స్నేహితులకు పంపాడు.
అంతటితో ఆగకుండా వాటిని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. ఆ వీడియోల గురించి తెలుసుకున్న బాలిక కుటుంసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిపై కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న ఆకాశ్‌ను వెతికి మరీ పట్టుకున్నారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఆకాశ్ ప్రేమ పేరుతో చాలా మందిని వేధించినట్లు తేలింది. మహిళలు, బాలికల ఫొటోలు, వీడియోలు కూడా అతడి ఫోన్‌లో గుర్తించారు.