వారిద్దరికి వివాహం అయ్యి ఎనిమిదేళ్లు అవుతుంది. కొన్నేళ్ల క్రితం వరకు ఇద్దరు అన్యోన్యంగా, సంతోషంగా ఉండేవారు. అయితే వేరే ఊరిలో పని చేస్తూ కుటుంబానికి దూరంగా ఉంటున్న భర్తకు మద్యం అలవాటయ్యింది. దాంతో పాటు అతడిలో అనుమానపు భూతం ప్రవేశించింది. ఈ క్రమంలో తరచూ భార్యను అనుమానిస్తూ.. ఆమెను చిత్ర హింసలకు గురి చేశాడు. భర్త తీరుతో విసిగిపోయిన సదరు మహిళ.. అతడిని మార్చుకోవాలని భావించి చేసిన పనికి.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. భార్య చేసిన ప్రయత్నం బెడిసికొట్టి భర్త మృతి చెందడంతో.. సదరు మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉంది. ఈ విషాదకర సంఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
కర్ణాటక, యవశంతపుర, మండ్యకు చెందిన మహేశ్‌కు అదే ఊరికి చెందిన శిల్పతో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరిద్దరూ బెంగళూరులోని కోణనకుంటెలో నివాసం ఉంటున్నారు. అయితే పని నిమిత్తం మహేశ్ మండ్యలో ఉండేవాడు. సెలవు దినాల్లో భార్యను చూడటం కోసం బెంగళూరుకు వచ్చేవాడు. అలా కొన్నేళ్ల వరకు వీరి కాపురం సజావుగానే సాగింది. అయితే ఈ మధ్య కాలంలో మహేష్‌కు మద్యం అలవాటయ్యింది. దాంతోపాటు భార్య శిల్పపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో తరచూ శిల్పను వేధించేవాడు. భర్త తీరు గురించి తల్లికి చెప్పుకుని.. పరిష్కారం సూచించాల్సిందిగా కోరింది శిల్ప.
శిల్ప ఆవేదన చూసిన ఆమె తల్లి.. అల్లుడికి బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో తన అన్న కుమారుడు బాలాజీకి కాల్ చేసి బెంగళూరు రప్పించింది. శిల్ప భర్త ప్రవర్తన గురించి చెప్పి.. అతడిని హెచ్చరించాలని కోరింది. ఈ క్రమంలో శిల్ప ఇంటికి చేరుకున్న బాలాజీ.. మహేష్‌పై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనలో మహేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం శిల్ప భర్త మృతదేహాన్ని తీసుకుని మండ్యకు వెళ్లింది. అయితే మహేష్ మృతదేహం చూసిన అతడి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. శిల్పను అదుపులోకి తీసుకుని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో శిల్పతో పాటు ఆమె తల్లిని అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయేండి.