ఆమెకు గతంలో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఇద్దరు పిల్లలు జన్మించారు. కట్ చేస్తే.. అందంగా లేవంటూ భర్త ఆమెను అవమానానికి గురి చేశాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఈ మధ్యకాలంలో కొంతమంది దంపతులు పెళ్లైన కొంత కాలం వరకు బాగానే ఉంటున్నారు. అన్యోన్యంగా జీవిస్తూ దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. అలా కొన్ని రోజులు గడుస్తుందో లేదో.. లేనిపోని ఆరోపణలతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకుంటుంటారు. అయితే, అచ్చం ఇలాగే బరితెగించిన ఓ భర్త.. పెళ్లైన కొన్నాళ్లకి భార్య అందంగా లేదంటూ దారుణంగా అవమానించాడు. అంతే కాదండోయ్.. పిల్లలు పుట్టినా కూడా అలాగే వేధింపులకు గురిచేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేట జిల్లాకు చెందిన సౌందర్య(26) అనే యువతిని ఇదే జిల్లాలోని కొండాపూర్ కు చెందిన గణేష్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుంచి ఈ దంపతులు ఉప్పల్ లోని భరత్ నగర్ లో నివాసం ఉంటున్నారు. అయితే, పెళ్లైన ఏడాదికే వీరికి కవల పిల్లలు జన్మించారు. ఇక పుట్టిన పిల్లలను చూసుకుంటూ ఈ భార్యాభర్తలు సంతోషంగానే ఉన్నారు. కానీ, రాను రాను గణేష్ తన అసలు రూపాన్ని బయట పెట్టాడు. పుట్టింటి నుంచి అదనపు కట్నం తేవాలంటూ టార్చర్ చేశాడు.
దీంతో సౌందర్య పుట్టింటి నుంచి కొంత సొమ్మును తెచ్చి భర్తకు ఇచ్చింది. ఇదే కాకుండా అత్తింటివాళ్లు గణేష్ కు ఓ చోట కొంత భూమిని కూడా ఇచ్చారు. అయినా ఇతగాడు సంతృప్తి చెందలేదు. కాగా, మరోసారి అడిగినంత కట్నం తేవాలంటూ వేధింపులకు గురి చేశాడు. ఇదే కాకుండా అందంగా లేవంటూ గణేష్ భార్య సౌందర్యను అనేక సార్లు అందరి ముందు అవమానించినట్లు తెలుస్తుంది. ఇక ఇవన్నీ తట్టుకోలేని ఈ వివాహిత.. గత 25 రోజుల కిందట బాన్సీలాల్ పేటలో ఉంటున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుంది. ఆ తర్వాత తరుచు ఆమెకు ఫోన్లు చేస్తూ వేధించేవాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికీ కౌన్స్ లింగ్ ఇచ్చి పంపినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, సౌందర్య సోమవారం భర్త పని చేసే చోటుకు వెళ్లింది. నన్ను ఇంటికి తీసుకెళ్లాలని కోరింది. దీనికి అతడు నిరాకరించినట్లు తెలుస్తుంది. సౌందర్య వెంటనే తన పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత తన ఇద్దరి పిల్లలతో పాటు వాళ్లు ఉంటున్న బిల్డింగ్ పైకి ఎక్కింది. ముందుగా పిల్లలను అక్కడి నుంచి కిందకు తోసి ఆ తర్వాత తానూ అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న సౌందర్య తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఇక పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.
Bansilalpet