అతడో సీరియల్ కిల్లర్. అతడికి రూ.500 అవసరమైతే చాలు ఒక ప్రాణం పోయినట్లే. మద్యం, గంజాయి కొనేందుకు రోడ్లపై అన్వేషిస్తాడు. ఫుట్‌పాత్‌లపై నిద్రిస్తున్న వారిని టార్గెట్‌గా చేసుకుంటాడు. అలా రెండు వారాల గ్యాప్‌లో ముగ్గుర్ని హతమార్చాడు.
ఆల్కహాల్, గంజాయి లాంటి వాటికి బానిసలై చాలా మంది తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొందరైతే వీటికి అడిక్ట్ అయి, మత్తులో ఇతరుల ప్రాణాల మీదకు తెస్తున్నారు. మద్యం మత్తులో ఇతరులపై దాడికి తెగబడిన ఘటనలు ఈమధ్య ఎక్కువవుతున్నాయి. కొందరైతే మద్యం, గంజాయికి డబ్బులు లేవని అమాయకుల పైకి అటాక్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనల్లో కొందరు ప్రాణాలు కోల్పోవడాన్ని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అలాంటి ఒక సంఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. మద్యం, గంజాయికి అలవాటు పడిన ఒక వ్యక్తి.. వాటిని కొనేందుకు డబ్బు అవసరమైతే చాలు రోడ్ల మీద అన్వేషిస్తాడు. భిక్షాటన లేదా ఇతర పనులు చేసి రోడ్లపై నిద్రించే వారిని తలపై బండరాయితో మోది చంపేస్తాడు. ఆ తర్వాత వారి దగ్గర ఉన్న డబ్బులతో పరారవుతాడు. గత 14 రోజుల వ్యవధిలో ఇలాంటి మూడు హత్యలు చేసిన సీరియల్ కిల్లర్ ప్రవీణ్‌ను మైలార్‌దేవ్‌పల్లిలో పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడు ప్రవీణ్‌పై మొత్తం ఎనిమిది హత్యలు, ఒక అత్యాచారం, ఐదు దోపిడీ కేసులు ఉన్నట్లు ఇన్వెస్టిగేషన్లో గుర్తించామని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. కాగా, రాజేంద్రనగర్ మాణిక్యమ్మ కాలనీకి చెందిన బ్యాగరి ప్రవీణ్ (34)కు చిన్నప్పటి నుంచే దొంగతనాలు చేయడం అలవాటు. షేక్ ఫయాజ్, దర్గా నరేశ్‌తో కలసి ముఠా కట్టిన ప్రవీణ్.. 2011లో రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలోని ఒక ఇంట్లో దోపిడీకి ప్లాన్ వేశాడు. ఇంటి యజమాని యాదయ్యను రాయితో కొట్టి చంపిన ఈ ముఠా.. ఆయన భార్యపై అత్యాచారం చేసి గొంతునులిమి చంపేశారు. అలాగే పదేళ్ల ఆమె కుమారుడ్ని కూడా హతమార్చారు. ఇంట్లోని డబ్బులు, బంగారం ఎత్తుకెళ్లారు. ఈ మూడు మర్డర్లు చేసిన తర్వాత ప్రవీణ్ స్నానం చేసి స్థానిక ఆలయంలో పూజలు చేసినట్లు పోలీసులు అప్పట్లో గుర్తించారు.
2011లో నెల గ్యాప్‌లో మరో రెండు హత్యలు చేశాడు ప్రవీణ్. అన్ని కేసుల్లో కలిపి అతడికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. గత నవంబరులో బెయిల్‌పై బయటకు వచ్చిన ప్రవీణ్.. మద్యం, గంజాయికి డబ్బులు అవసరమై మళ్లీ మర్డర్లు చేయడం మొదలుపెట్టాడు. తనకు రూ.500 అవసరమైనప్పుడల్లా నిందితుడు హత్యలు చేస్తున్నట్లు ఇన్వెస్టిగేషన్లో తేలిందని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు. మద్యం, గంజాయి తాగాక రోడ్ల మీద తిరుగుతూ ఫుట్‌పాత్‌లు, దారి పక్కనే నిద్రపోయే వారిని అతడు టార్గెట్ చేసుకుంటాడని చెప్పారు. వారి పక్కన కొద్దిసేపు నిద్రిస్తున్నట్లు యాక్ట్ చేసి.. ఆ తర్వాత చంపేస్తాడని డీసీపీ పేర్కొన్నారు. అనంతరం వారి దగ్గర ఉన్న డబ్బుతో పరారవుతాడన్నారు. ఈ హత్యలు ఎందుకు చేశావని నిందితుడ్ని ప్రశ్నించినప్పుడు.. ‘చంపేశా. అయిపోయింది. ఏం చేద్దాం..!’ అంటూ నిందితుడు ప్రవీణ్ విచిత్రంగా బదులిచ్చాడని డీసీపీ జగదీశ్వర్ రెడ్డి వివరించారు.