అనుమానం బెనుబూతంగా మారిన ఓ నరహంతక భర్త తన భార్యపై దారుణ హత్యకు పాల్పడ్డాడు. ఉమ్మడి మెదక్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణమైన ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేస్తోంది. మద్యానికి బానిసైన ఇతను భర్తను వేదించడమే పనిగా పెట్టుకుని చివరికి భార్య ప్రాణాలను చేతులారా తీశాడు. ఇక విషయం ఏంటంటే..? సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పరిధిలో చిట్కుల్ గ్రామంలో మెఘవేలు, రాజేశ్వరి అనే భార్య భర్తలకు కొన్నాళ్ల క్రితం వివాహం జరిగింది. అదే గ్రామంలో వడ్డెర కాలనీలో వాళ్లిద్దరూ నివాసం ఉంటున్నారు. ఇక వీరి వివాహ బంధం కొంత కాలం బాగానే నడిచింది.
ఇక అక్క, చెల్లెల్లతో తరుచు ఫోన్‌లో మాట్లాడుతున్న భార్య రాజేశ్వరిపై భర్త మెఘవేలు అనుమానం పెంచుకున్నాడు. దీంతో వీరి మధ్య గొడవలు కూడా జరిగాయి. భర్త గొడవలు బరించని భార్య కొన్నాళ్లు తన పుట్టింటికి వెళ్లింది. అలా కొన్ని రోజుల తర్వాత భర్త వద్దకు మళ్లీ చేరుకుంది భార్య. మళ్లీ ఫోన్‌లో మాట్లాడటం చూసిన భర్త కొన్నాళ్లు ఒపికతో బరించాడు. కానీ మార్పు రాలేదని భావించిన మెఘవేలు భార్యను అంతమొందించేందుకు ప్లాన్ వేశాడు. ఒక సమయం కోసం ఎదురుచూస్తున్న భర్తకు ఆ రోజు రానే వచ్చింది.
ఇక భార్య రాజేశ్వరి అర్థరాత్రి గాడమైన నిద్రలోకి జారుకుంది. మెల్లగా నిద్రలేచిన భర్త రాళ్లు కొట్టే సుత్తి చేత పట్టుకున్నాడు. ఆ సుత్తితో భార్య రాజేశ్వరి తలపై బలంగా బాదాడు. దీంతో ఆ మహిళ నెత్తురోడుతున్న రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంది. భర్త అదే సుత్తి తీసుకుని రోడ్డుపై పరుగులు పెట్టి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఇక స్థానికులకు అనుమానం రావటంతో ఇంట్లోకి వెళ్లి చూస్తే నెత్తుటి సంద్రంలో రాజేశ్వరి కొన ఊపిరితో కొట్టుకుంటోంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయిన ఫలితం లేకపోవటంతో భార్య రాజేశ్వరి కన్నుమూసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.