రోజూలాగే ఆ రోజు కూడా పిల్లలు స్కూల్‌ను శుభ్రం చేయటానికి వెళ్లారు. స్కూల్లోని ఓ క్లాస్ తలుపు తెరిచారు. అక్కడి దృశ్యం చూసి పిల్లలు షాక్ తిన్నారు. భయంతో ఏడ్వటం మొదలుపెట్టారు. వారిని అంతలా భయపెట్టిన దృశ్యం ఏంటంటే.. క్లాసులోని ఫ్యాన్‌కు ఓ వ్యక్తి విగతజీవిలా కనిపించాడు. తమకు బాగా కావాల్సిన ఆ వ్యక్తి ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించటంతో వారు వెక్కివెక్కి ఏడ్చారు. క్షణాల్లో ఈ విషయం ఊర్లో వాళ్లకు తెలిసింది. మృతుడి కుటుంబసభ్యులతో సహా అందరూ అక్కడకు వచ్చారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఎందుకాయన క్లాస్ రూములో ఆత్మహత్య చేసుకున్నాడు?.. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
ఉత్తర ప్రదేశ్, ఉపరాంఖ గ్రామానికి చెందిన సుగ్రీవ శ్రీవాస్ అనే 55 ఏళ్ల వ్యక్తి గ్రామంలోని స్కూల్లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2012 వరకు సాధారణ టీచర్‌గా ఉన్న ఆయన ప్రిన్సిపల్‌గా ప్రమోషన్ పొందారు. తమ స్కూల్లోని పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకునేవారు. అయితే, గత కొద్దిరోజుల నుంచి కుటుంబ సమస్యల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఆ సమస్యలే అతడ్ని తీవ్రంగా వేధించసాగాయి. స్కూల్లోని ఓ ఉపాధ్యాయుడికి తన బాధలు చెప్పుకుని ఏడ్చాడు కూడా. ఈ నేపథ్యంలోనే బుధవారం నుంచి ఆయన కనిపించకుండా పోయారు.
కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆయన గురించి అంతా వెతికారు. ఎక్కడా ఆయన ఆచూకీ కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఉదయం స్కూల్‌కు వెళ్లిన విద్యార్థులకు క్లాస్ రూములో సుగ్రీవ విగత జీవిగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సుగ్రీవ ఆత్మహత్య చేసుకోవటానికి గల సరైన కారణాల కోసం అన్వేషిస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.