ఎన్నో కలలు, ఆశయాలతో మంచి ఉద్యోగం కోసం ఆ యువతి ఎంతో శ్రమించింది. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగ వేట ఆరంభించి.. కొన్ని రోజులకు కోరుకున్న ఉద్యోగాన్ని కూడా సాధించింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరడమే తరువాయి.. కానీ ఏమైందో ఏమో తెలియదు.. ఉద్యోగంలో చేరాల్సిన ఒక్కరోజు ముందు జీవితాన్ని చాలించాలని నిర్ణయించుకుంది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరు గ్రామానికి చెందిన జాస్తి శ్వేతా చౌదరి (22) బీటెక్ పూర్తి చేసి, కొన్ని నెలలుగా ఐటీ ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది. పలు కంపెనీలకు ఉద్యోగం కోసం ఆన్లైన్లో దరఖాస్తు కూడా చేసుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యింది. తెల్లవారితే వెళ్లి ఉద్యోగంలో చేరాల్సి ఉండగా.. ఉన్నట్టుండి శనివారం రాత్రి చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం సాయంత్రం ఇంటి నుంచి స్కూటీపై వెళ్లిన శ్వేతా దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలో చెరువు వద్ద ఆగింది.
‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను.. మమ్మీ, డాడీ ఐ లవ్ యూ..’ అంటూ తన ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు వాయిస్ మెసేజ్ పెట్టింది. అనంతరం రాత్రి 9.00 గంటల సమయంలో చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. శ్వేతా వాయిస్ మెసేజ్ చూసిన వెంటనే తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ వాయిస్ మెసేజ్ ఆధారంగా జగ్గయ్యపేట రూరల్ పరిధిలోని చిల్లకల్లు చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ యువతి వాహనాన్ని గుర్తించి, చెరువులో గాలింపు చేపట్టారు. రాత్రి 12.00 గంటల సమయంలో యువతి మృతదేహం చెరువులో లభ్యమైంది. కూతురి మృతదేహం చూసి ఆ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
అతడిపై అనుమానం..
శ్వేతా చౌదరికి ఇటీవల ఆన్లైన్లో ఓ వ్యక్తి పరిచయమైనట్లు సమాచారం. ఆ వ్యక్తి ఆమె ఖాతాకు రూ.90 వేలు పంపి, ఆ మొత్తాన్ని మరో వ్యక్తికి పంపాలని కోరడంతో శ్వేతా అతను చెప్పినట్లు చేసింది. ఇదే అదునుగా ఆ వ్యక్తి శ్వేతాను పలు విధాలుగా వేధింపులకు గురి చేశాడు. తన ఖాతాకు రూ.5 లక్షలు పంపాలని బెదిరిస్తూ మానసికంగా వేధించాడు. అతని వేధింపులు భరించలేకే శ్వేతా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని మృతురాలి తండ్రి సోమశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.