ప్రముఖ టిక్ టాక్ స్టార్, బిగ్‌బాస్ కంటెస్టెంట్, హర్యానా బీజేపీ నాయకురాలు సోనాలి ఫొగట్ రెండు రోజుల క్రితం మృతి చెందిన సంగతి తెలిసిందే. గోవా వెళ్లిన ఆమె గుండెపోటుతో మరణించినట్లు తొలుత ప్రకటించారు. అయితే ఆమె మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె సోదరుడు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. ఈ క్రమంలో సోనాలి పోస్ట్‌మార్టం రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఆమెది సహజ మరణం కాదని.. హత్య అని వైద్యులు వెల్లడించారు. సోనాలి హార్ట్ ఎటాక్‌తో చనిపోలేదు.. ఆమెను హత్య చేశారు అని గోవా మెడికల్ కాలేజీ డాక్టర్ల ప్యానెల్ నిర్వహించిన పోస్టుమార్టంలో వెల్లడైంది. ఈ క్రమంలో ఆమెతోపాటు గోవా వచ్చిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు మర్డర్ కేసు నమోదు చేశారు.
పోస్టుమార్టంలో ఆమె శరీరంపై కమిలిన గాయాలను గుర్తించారు వైద్యులు. సోనాలి మంగళవారం ఉదయం చనిపోగా.. ఆమె కుటుంబ సభ్యుల అంగీకారంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టం రిపోర్టులో సోనాలి చర్మంపై కమిలిన గాయాలు ఉన్నట్లు వెల్లడయ్యింది. ఈ క్రమంలో సోనాలి పీఏ సుధీర్ సాంగ్వాన్, ఆమె స్నేహితుడు సుఖ్‌విందర్‌లపై హత్య కేసు నమోదు చేశామని అంజునా పీఐ ప్రశాల్ దేశాయ్ వెల్లడించారు. వీరిద్దరని అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
సోనాలి మృతి చెండానికి కనీసం ఆరు గంటల ముందు ఆమె శరీరంపై ఈ గాయాలై ఉంటాయని ఫోరెన్సిక్ నిపుణులు వెల్లడించారు. పిడిగుద్దులు గుద్దడం వల్ల లేదంటే కింద పడటం వల్ల ఆమెకు ఈ గాయాలై ఉంటాయని భావిస్తున్నట్లు ఫోరెన్సిక్ అధికారులు తెలిపారు. సోనాలి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా.. వారు హర్యానా తీసుకెళ్లారు. మరి టిక్‌టాక్ స్టార్ హత్యపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.