Nellore: ప్రస్తుతం ఏ సమయానికి ఏమి జరుగుతుందో చెప్పడం చాలా కష్టం అయిపోయింది. మనిషి ప్రాణం పోవడానికి క్షణ కాలం పట్టడంలేదు. ఈ క్రమంలోనే పొద్దున్నే పాఠశాలకు వెళ్లిన తమ కూతురు సాయంత్ర ఇంటికి తిరిగి వస్తుందనుకున్నారు.. ఆ తల్లిదండ్రులు. కానీ ఆ రోజే ఆ బాలికకు చివరి రోజు అవుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషాదకర సంఘటన పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం చోటుచేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
కొండాపురం మండలం గరిమెనపెంటకు చెందిన దంపతులు ఖాజాహుస్సేన్, రెహానా. వీరికి కుమార్తె షాజిద (12), కుమారుడు షబ్బీర్(14) ఉన్నారు. షాజిద వింజమూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. రోజూ లాగానే బుధవారం కూడా బాలిక పాఠశాలకు వెళ్లింది. క్లాస్ రూమ్‌లో ఓ టీచర్ బాలికను కొన్ని ప్రశ్నలు వేశారు. వాటికి షాజిద సమాధానాలు చెబుతుండగా ఉన్నట్లుండి ఒక్కసారిగా ఆమె నేలకూలింది. దీంతో టీచర్లు ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. బాలికను పరీక్షించిన వైద్యులు, ఆమె అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. బాలిక మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. అంత చిన్న వయసులో గుండెపోటు రావటం ఏంటని స్థానికులు వాపోతున్నారు.
ఈ విషయంపై చిన్నపిల్లల వైద్యురాలు కె. మాశిలామణి స్పందిస్తూ.. “చిన్నప్పటి నుంచి బాలిక గుండెలోగానీ, బ్రైన్ లో గానీ ఏదైన సమస్య ఉంటేనే ఇలా సడెన్ గా మరణించే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ఇదే బాలిక మరణానికి కారణం అయ్యుంటుందని ఆమె పేర్కొన్నారు. ఇక షాజిద మృతితో అటు పాఠశాలలో ఇటు ఇంటి దగ్గర తీవ్ర విషాదం నెలకొన్నది. షాజిద తండ్రి ఉపాధి కోసం సౌదీ వెళ్లాడు. అయితే ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైన విషయం ఏంటంటే 12 సంవత్సరాలకే గుండెపోటు రావడం ఏంటని! మరి ఈ హృదయ విదారక ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.