ఆ తండ్రికి కూతురంటే ప్రాణం. చిన్న తనంలో గుండెల మీద ఎత్తుకు ఆడించినపుడు కూతురు తంతుంటే ఎంతో మురిసిపోయాడు. అన్నీ తానై ఆమెను పెంచాడు. అయితే, పెరిగి పెద్దదైన తర్వాత ఆమె చేసిన ఓ పని ఆయనకు నచ్చలేదు. కాదు, కూడదు అన్నాడు. ఆమె వినలేదు. అల్లారుముద్దగా పెంచుకున్న తండ్రే కూతుర్ని కడతేడ్చాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆమె చేసిన తప్పేంటి? ఆ తండ్రి ఆమెను ఎలా చంపాడు? అని తెలుసుకోవాలంటే మొత్తం స్టోరీ చదివేసేయండి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, బళ్లారి జిల్లా కుడతినికి చెందిన ఓంకార్ గౌడకు ఓ కూతురు ఉంది. ఆమె కాలేజ్‌లో చదువుతోంది.
అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడితో ఆమె ప్రేమలో పడింది. కొన్ని నెలల తర్వాత ఈ విషయం ఓంకార్‌కు తెలిసింది. దీని గురించి కూతుర్ని అడిగాడు. ఆమె తన ప్రేమ గురించి చెప్పింది. అయితే, కూతురు ప్రేమించిన యువకుడిది తమ కులం కాదని తెలిసింది. దీంతో ఓంకార్ కూతురి ప్రేమకు నో చెప్పాడు. ప్రియుడ్ని మర్చిపొమ్మని అన్నాడు. అందుకు కూతురు ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ జరిగింది. ఏం జరిగినా కూతురు మాత్రం వెనక్కు తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఓంకార్ ఓ ప్లాన్ వేశాడు. తన పరువు కంటే కూతురు ఎక్కువ కాదు అనుకున్నాడు.
అక్టోబర్ 31న కూతుర్ని సినిమా కోసం కారులో బయటకు తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరూ సినిమా చూశారు. ఆ తర్వాత కూతుర్ని నగల షాపునకు కూడా తీసుకెళ్లాడు. ఆమెకు నచ్చిన బంగారు వస్తువుల్ని కొనిచ్చాడు. షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరూ ఇంటికి బయలు దేరారు. మార్గం మధ్యలో ఓంకార్ కారును ఓ పెద్ద నీటి కాల్వ దగ్గర ఆపాడు. మెల్లగా కిందకు దిగాడు. కూతుర్ని కూడా కిందకు దిగమని అన్నాడు. తండ్రి ఎందుకు దిగమన్నాడో ఆమె గుర్తించలేకపోయింది. గుడ్డిగా కారులోంచి కిందకు దిగింది. కూతురు తన దగ్గరకు రాగానే ఆమెను కాల్వలోకి తోసేశాడు. నీళ్లలో పడ్డ కూతురు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతూ ఉంది.
సహాయం కోసం అరుస్తూ ఉంది. అయినా ఆ తండ్రి పట్టించుకోలేదు. దీంతో కూతురు కొట్టుకుపోయి చనిపోయింది. ఇది జరిగిన తర్వాత ఓంకార్ ఇంటికి వెళ్లలేదు. నేరుగా తిరుపతి వెళ్లాడు. అయితే, బయటకు వెళ్లిన తండ్రీ,కూతుళ్లు ఎంతకీ ఇంటికి రాకపోవటంతో కుటుంసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరుసటి రోజు ఇంటికి వచ్చిన ఓంకార్‌ను కూతురి గురించి విచారించారు. పొంతన లేని సమాధానాలు చెప్పటంతో తమదైన శైలిలో విచారించారు. ఓంకార్ తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడు ఇచ్చిన సమాచారం మేరకు బాలిక శవాన్ని కెనాల్‌నుంచి స్వాధీనం చేసుకున్నారు.