వివాహేతర సంబంధాలు.. ఇదే పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తూ సంసారాన్ని నాశనం చేస్తుంది. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరు అక్రమ సంబంధాల్లో పాలుపంచుకుని చివరికి హత్యలు, ఆత్మహత్యలతో జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే ఓ మహిళ భర్తకు దూరంగా ఉంటూ ఓ వ్యక్తికి దగ్గరైంది. ఆ తర్వాత ఆ మహిళ అతనితో సహజీవనం చేస్తూ వచ్చింది. అలా కొన్నాళ్ల పాటు సాగిన వీరి వివాహేతర సంబంధంలో చివరికి ఊహించిన దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
ఏపీలోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం కాట్రేనిపాడు గ్రామం. ఇదే ప్రాంతంలో ఉన్న శ్రీరామ్ నగర్ లో మరియమ్మ (35) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు అఖిల అనే పదేళ్ల కూతురు కూడా ఉంది. అయితే మరియమ్మ గత 10 ఏళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటూ కూతురితో పాటు నివాసం ఉంటుంది. ఈ క్రమంలోనే మరియమ్మకు స్థానికంగా ఉండే రవి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతడు కూడా గతంలో భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. ఇదే సమయంలో ఒకరికొకరు పరిచయం కావడంతో ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. లారీ డ్రైవర్ గా పని చేస్తున్న రవి కొంత కాలం తర్వాత మద్యానికి అలవాటు పడి మరయమ్మతో గొడవ పడేవాడు. ఇంతటితో ఆగకుండా ఇంట్లో ఖర్చులకు డబ్బులు ఇవ్వకపోవడం, కరెంట్ బిల్లులు కట్టకపోవడం చేసేవాడు.
దీంతో తరుచు ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. ఇదే సమయంలో మరియమ్మ రవితో ఉండలేక ఇటీవల తన కూతురుని తీసుకుని పుట్టింటికి వెళ్లింది. ఇక కొన్ని రోజులు గడిచిన తర్వాత.. రవి మరియమ్మ పుట్టింటికి వెళ్లాడు. ఇక నుంచి బుద్దిగా ఉంటానని భార్యను నమ్మించి మరియమ్మను మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లాడు. రవిని నమ్మిన మరియమ్మ వెంటనే అతని ఇంటికి వచ్చింది. అయితే శుక్రవారం రాత్రి అందరూ తిని పడుకున్నారు. ఈ క్రమంలోనే అర్థరాత్రి నిద్రలేచిన రవి… ఇంట్లో ఉన్న గునపంతో మరియమ్మ, ఆమె కూతురు అఖిలను దారుణంగా కొట్టి చంపాడు. అనంతరం రవి ఇంటికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే మరియమ్మకు ఆమె కుటుంబ సభ్యులు అనేక సార్లు ఫోన్ చేశారు. ఎంతకు కూడా సమాధానం ఆమె సమాధానం ఇవ్వలేదు. దీంతో అనుమానం రావడంతో మరియమ్మ కుటుంబ సభ్యులు ఇంటికి వచ్చి చూడగా…. మరియమ్మ, అఖిల ఇద్దరు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నారు. ఈ సీన్ చూసిన మరియమ్మ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం తరలించారు. ఆ తర్వాత మృతురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.