పెళ్లయి మూడేళ్లు ఎంతో అందంగా సాగుతుందనుకుంది. కానీ, భర్త రూపంలో ఓ నరక కూపం ఆమెను చుట్టుముట్టింది. నిత్యం వేధించసాగింది. ఆ భర్త తన భార్యను దారుణంగా హింసించాడు. చివరకు ఎంతకు తెగించాడంటే..
అన్ని పెళ్లి బంధాలు అందమైనవి కావు. కొన్ని బంధాలు నిత్యం బాధిస్తూ ఉంటాయి. పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎవరో ఒకరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అర్థం చేసుకునే మనుసు ఉంటే సరే.. లేదంటే నిత్యం గొడవలు పడుతూ దిన దిన గండం నూరేళ్ల అయుష్షులా జీవితం సాగుతుంది. ముఖ్యంగా కట్నం కోసం హింసించే భర్తలు ఉన్న భార్యల జీవితం నరక కూపమే అవుతుంది. వారు తమ భార్యలను హింసించటమే కాదు.. చంపటానికి కూడా వెనుకాడరు. తాజాగా, ఓ వ్యక్తి అదనపు కట్నం కోసం తన భార్యను హింసించాడు. ఆమె డబ్బు తీసుకురాకపోయే సరికి చంపేశాడు. తర్వాత ఆత్మహత్య చేసుకుందని నాటకం ఆడాడు. చివరకు పాపం పండి అరెస్ట్ అయ్యాడు. ఈ సంఘటన కర్ణాటకలో ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటక, చిత్రదుర్గ తాలూకాలోని భూగళనహట్టి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ అనే వ్యక్తి డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఇతడికి గూళయ్యహట్టి గ్రామానికి చెందిన గోవిందప్ప కూతురు గౌతమితో మూడేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో గోవిందప్ప తన తాహతకు తగ్గట్టు కట్నం ఇచ్చాడు. తర్వాత పెట్టుపోతలు కూడా బాగా పెట్టే వాడు. తల్లి లేని కూతురు గనుక ఆమెను చాలా బాగా చూసుకునే వాడు. ఆ ప్రేమతోనే కూతురికి ఎలాంటి లోటు రాకుండా అత్తింటికి అవసరమైనవి పంపేవాడు. చంద్రశేఖర్, గౌతమిల కాపురం కొన్ని రోజులు బాగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు రావటం మొదలయ్యాయి.
అదనపు కట్నం కోసం గౌతమిని చంద్రశేఖర్ హింసించేవాడు. బాగా కొట్టే వాడు. పెద్ద మనుషుల పంచాయితీ జరిగింది. గోవిందప్ప 2 లక్షలు ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. అయితే, చంద్రశేఖర్ ఆశ అంతటితో చావలేదు. గోవిందప్ప ఆస్తి మొత్తం కావాలని పట్టు పట్టాడు. మార్చి 11న ఈ విషయమై భార్యతో గొడవపడ్డాడు. ఆమెను చంపాడు. తర్వాత ఆమె మెడకు ఉరి బిగించాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భార్య ఆత్మహత్య చేసుకుందని ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. చంద్రశేఖర్‌ను అరెస్ట్ చేశారు. మరి, అదనపు కట్నం కోసం భార్యను చంపి నాటకాలు ఆడిన చంద్రశేఖర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.