ఆమె ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఆ రోజు స్కూల్ క్లాస్ రూములో ఎవ్వరూ లేని సమయంలో లోపల గడియ పెట్టుకుంది. క్లాస్ రూములోకి వెళ్లిన ఆమె ఎంతకీ రాకపోవటంతో తలుపులు బద్దలు కొట్టారు. లోపల దృశ్యం చూసి..
ప్రేమ పెళ్లిళ్లు కావచ్చు.. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు కావచ్చు.. పెళ్లి తర్వాత 80 శాతం మంది ఆడపిల్లల జీవితాలు సంతోషంగా ఉండటం లేదు. భర్త లేదా అత్తింటి వారి వేధింపుల కారణంగా నిత్యం నరకం చూస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అనుమానం, అధిక కట్నం ఇలా ఏదో ఒక విషయంలో మహిళలు గృహ హింసకు గురవుతున్నారు. ఈ వేధింపులు తాళలేక భర్తనుంచి విడిపోయి వేరుగా ఉంటున్న వారు కొందరైతే.. ప్రాణాలు తీసుకుంటున్న వారు మరికొంతమంది. ఒక్కోరి కథ ఒక్కో విషాదం. అలాంటి విషాదాంతంలో బసమ్మ కథ కూడా ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆమెను అదనపు కట్నం కోసం వేధించాడు. అత్తింటి వారు కూడా భర్తకు తోడై నిత్యం ఇబ్బందిపెట్టే వారు. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకుంది.
అది కూడా తాను పాఠాలు చెప్పే స్కూల్లో ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని విజయనగర జిల్లా హూవిన హడగలికి చెందని బసమ్మ, అర్జున్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమ వివాహం జరిగి 10 ఏళ్లు గడుస్తోంది. ఇద్దరూ హూవిన హడగలిలోని నేషనల్ కాలేజీలో టీచర్లుగా పని చేస్తున్నారు. ఆదివారం పరీక్ష విధులకోసం బసమ్మ కాలేజీకి వచ్చింది. పరీక్ష అయిపోయిన తర్వాత క్లాసు రూములోకి వెళ్లి గడియపెట్టుకుంది. విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. క్లాస్ రూములోకి వెళ్లిన బసమ్మ ఎంత సేపటికి బయటకు రాకపోయే సరికి తోటి ఉపాధ్యాయులకు అనుమానం వచ్చింది. వెంటనే క్లాసు తలుపుల పగులగొట్టారు.
లోపల బసమ్మ విగత జీవిగా కనిపించింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడకు వచ్చిన పోలీసులు బసమ్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వం వైద్యశాలకు పంపించారు. బసమ్మ చనిపోయిన క్లాసురూములో పోలీసులకు ఓ సూసైడ్ నోట్ కనిపించింది. అందులో తన చావుకు గల కారణాలను బసమ్మ వివరించింది. భర్త, అత్త, ఆడపడచు వేధింపుల కారణంగా చనిపోతున్నట్లు రాసింది. వరకట్న వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు పేర్కొంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.