మనుషులు తిండి లేకున్నా కొన్ని రోజులు గడుపుతారేమో కానీ పరువు పోతుందంటే మాత్రం అస్సలు ఊహించలేరు, తట్టుకోలేరు. ఇలాగే కొందరు కేటుగాళ్లు న్యూడ్ ఫోటోలతో ఓ దంపతులకు బ్లాక్ మెయిల్ కాల్స్ చేయడంతో పరువు పోతుందని ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లూరి సీతామారామరాజు జిల్లా రాజవొమ్మండి మండలం లబ్బర్తి. ఇదే గ్రామానికి చెందిన దుర్గారావు, రమ్యలక్ష్మి భార్యాభర్తలు. వీరికి పెళ్లై ఆరు ఏళ్ల కాలం తర్వాత ఇద్దరు పిల్లలు జన్మించారు. భర్త పెయింటింగ్ పని చేస్తుండగా, భార్య రమ్యలక్ష్మి టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. అలా కొన్నాళ్ల పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. కానీ ఇటీవల వీరికి కొంత డబ్బు అవసరం ఉండడంతో తెలిసిన వారిని అడిగారు, ఎవరూ కూడా ఇస్తామని ముందుకు రాలేదు. దీంతో ఆన్ లైన్ యాప్ లో కొంత సొమ్మును అప్పుగా తీసుకున్నారు. అలా కొన్ని రోజులు గడిచింది. బాగా ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలోనే ఆ లోన్ యాప్ నిర్వాహకులు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ వేధించారు. ఇప్పుడు ఇవ్వలేమని, కొన్ని రోజులు ఆగాల్సిందే అంటూ బతిమాలారు. అయినా వినని ఆ నిర్వహకులు తీసుకున్న డబ్బు తొందరగా చెల్లించాలని, లేకుంటే మీ భార్య న్యూడ్ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామంటూ బ్లాక్ మెయిల్ కాల్స్ చేశారు.
అలా రెండు రోజులు గడిచిందో లేదో.. తన భార్య న్యూడ్ ఫోటోలను భర్తకు పంపారు. ఇవి ఫోటోలు మాత్రమేనని, ఇంకా వీడియోలు కూడా తయారు చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తామని బెదిరింపులకు దిగారు. తన భార్యను అలాంటి ఫోటోలతో చూడడంతో భర్త దుర్గారావు తట్టుకోలేక తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ క్రమంలోనే ఈ దంపతులిద్దరూ కలిసి ఇటీవల రాజమండ్రిలో ఓ ఫంక్షన్ కు హాజరయ్యారు. అనంతరం తిరిగి వస్తున్న దారిలోనే రాజమండ్రిలో ఓ లాడ్జీలో దిగారు. అక్కడికి చేరుకున్న తమ బంధువులకు ఫోన్ చేసి.. మేము చనిపోతున్నామని, మా పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఫోన్ చేసి చెప్పి పురుగుల మందు తాగారు.
బంధువులు వెంటనే వారున్న లాడ్జీలోకి వెళ్లి చూడగా.. నోటి నుంచి నురగలు కక్కుతూ కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించి వారి ప్రాణాలను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ వారు అప్పటికే చనిపోయారని వైద్యులు నిర్ధారించారు. భార్యాభర్తలిద్దరూ ఒకేసారి మరణించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. లోన్ యాప్ వేధింపులను భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ఈ దంపతుల విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.