కన్న తండ్రిని శిక్షించి న్యాయం చేయమని రక్తంతో లేఖ రాశారు ఇద్దరు కూతుర్లు. లేఖ రాసిన ఆరేళ్ళ తర్వాత న్యాయం దక్కింది. చివరకు హంతక తండ్రికి శిక్ష పడింది. ఆ కూతుర్లు ఎవరు? అతను ఎవరు? ఆ తండ్రి చేసిన తప్పేంటి? కన్న తండ్రిని శిక్షించమనేంత పెద్ద నేరం అతనేం చేశాడు? వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ వాసులైన లతికా బన్సల్(21), ఆమె చెల్లి తాన్య ఇద్దరూ తమ తల్లి చావుని ప్రత్యక్షంగా చూశారు. సరిగ్గా ఆరేళ్ళ క్రితం జరిగిందీ సంఘటన. వారి తండ్రి తమ తల్లిని గదిలో బంధించి నిప్పు పెట్టాడు. తమ తల్లి కళ్ళ ముందే తగలబడిపోతున్నా ఏమీ చేయలేని స్థితిలో ఉన్నారు. 15, 11 ఏళ్ళు ఉంటాయి ఆ పిల్లలకి. ఆ వయసులో కన్న తల్లిని కాపాడుకోలేక విలవిలలాడిపోయారు. అయితే వీరి తండ్రి మనోజ్ బన్సల్ మాత్రం భార్య ఆత్మహత్య చేసుకుందని ప్రచారం చేశాడు. కానీ ప్రత్యక్ష సాక్షులుగా ఉన్న కూతుర్లు మాత్రం తమ తండ్రికి శిక్ష వేయాలని కోర్టుకెక్కారు.
ఆరేళ్ళ సుధీర్ఘ పోరాటం తర్వాత మనోజ్ బన్సల్‌కి ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహత్ కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. మగపిల్లాడికి జన్మనివ్వలేదన్న కారణంగానే భార్యను చంపినట్టు కోర్టు పేర్కొంది. మగపిల్లాడికి జన్మనివ్వలేదన్న కారణంతో తండ్రి రోజూ తమ తల్లి అను బన్సల్‌ను కొడుతుండేవాడని ఆడపిల్లలిద్దరూ కోర్టుకి వివరించారు. ఆడపిల్లలకు జన్మనిచ్చిందని, మగ సంతానం కోసం తమ తల్లిని తండ్రి తరపు కుటుంబసభ్యులు కూడా తిట్టడం, వేధించడం వంటివి చేశారని, ఆ దుశ్చర్యలను చూస్తూ పెరిగామని ఆడబిడ్డలు కోర్టుకు వివరించారు. అంతేకాదు తమ తల్లి గర్భం దాల్చినప్పుడు అక్రమ లింగ నిర్ధారణ పరీక్షలు చేయించేవాడని, ఆడబిడ్డ అని తెలిసాక బలవంతంగా అబార్షన్ చేయించేవాడని అన్నారు. తమ తల్లికి ఆరు సార్లు అబార్షన్ చేయించాడని కోర్టులో వెల్లడించారు.
2016 జూన్ 14వ తేదీన తమ తల్లిని కోల్పోయామని, ఆరోజు ఉదయం తమ తండ్రి.. తమ తల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడని ఆడపిల్లలు వివరించారు. ఉదయం 6.30 గంటలకు అమ్మ ఏడుపులు వినిపించడంతో మేల్కొన్న ఇద్దరు అమ్మాయిలు అమ్మ దగ్గరకు వెళ్ళే ప్రయత్నం చేశారు. అయితే తమ గది తలుపు బయట గడియ పెట్టి ఉండడంతో సహాయం చేయలేకపోయామని అన్నారు. అమ్మ కాలిపోవడాన్ని కిటికీలోంచి చూశామని అమ్మాయిలిద్దరూ కోర్టులో సాక్ష్యం చెప్పారు. స్థానిక పోలీసులకు, అంబులెన్స్ సర్వీసులకు ఫోన్ చేసినా తమను పట్టించుకోలేదని లతిక వెల్లడించారు. అమ్మమ్మ, మావయ్యలకు ఫోన్ చేయగా.. వారు వచ్చి తమ తల్లిని ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలిపారు. 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన తమ తల్లి కొన్ని రోజుల తర్వాత ఆసుపత్రిలోనే మరణించారని అన్నారు.
అమ్మ చనిపోయినప్పుడు తనకి 15 ఏళ్ళు, చెల్లికి 11 ఏళ్ళు ఉంటాయి. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌కు తమ తల్లికి న్యాయం చేయమని రక్తంతో లేఖ రాయడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు తమ తల్లి హత్య కేసును, అత్మహత్యగా మార్చివేశారని అమ్మాయిలిద్దరూ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత ఈ కేసును సరిగ్గా విచారించని పోలీసు అధికారిని సస్పెండ్ చేసి, ఈ కేసు విచారణ బాధ్యతలను సీనియర్ పోలీసు అధికారులకు అప్పగించారు అఖిలేశ్ యాదవ్.
Bulandshahr: 15 yr old Latika Bansal writes to UP CM in blood, seeks justice for her mother who was burnt alive pic.twitter.com/7xHzS6bWRl
— ANI UP/Uttarakhand (@ANINewsUP) August 13, 2016
ఎట్టకేలకు కోర్టు తమ తండ్రిని దోషిగా నిర్ధారించిందని ఆ అమ్మాయిలు అన్నారు. అమ్మాయిలకి న్యాయం దక్కడానికి 6 సంవత్సరాల నెలా 13 రోజులు పట్టిందని అమ్మాయిల తరపు న్యాయవాది సంజయ్ శర్మ అన్నారు. ఈ ఆరేళ్లలో న్యాయం కోసం ఈ అమ్మాయిలిద్దరూ వంద సార్లకు పైగా విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యారని, ఏరోజూ మిస్ కాలేదని ఆయన అన్నారు. ఇది కేవలం మహిళ హత్య కాదని, సమాజానికి వ్యతిరేకంగా జరిగిన నేరం అని అన్నారు.
పుట్టబోయే బిడ్డ ఆడ, మగ అని తెలుసుకుని కనడానికి ఆడవాళ్ళకేమైనా అతీత శక్తులు ఉంటాయా? వచ్చేది ఆడ బిడ్డయినా, మగ బిడ్డయినా అన్నీ మూసుకుని స్వీకరించడమే. మనం తినే తిండి, ఉండే వాతావరణం, ఉండే పరిస్థితికి మహిళలు పిల్లల్ని కనడమే ఎక్కువ, మళ్ళీ ఇందులో ఆప్షన్స్ ఒకటి. వారసత్వం కోసమో, ఇంకేదో ప్రయోజనాల కోసమో మగ బిడ్డ పుట్టేవరకూ ఆడవారిని పిల్లల్నికనే యంత్రాల్లా చూడడం, మగ పిల్లాడు పుట్టలేదన్న కారణంగా చిత్ర హింసలు పెట్టడం క్షమించరాని నేరం. మరి మగ పిల్లాడి కోసం తమ తల్లిని చంపిన తండ్రిని కోర్టు ముందు దోషిగా నిలబెట్టిన అమ్మాయిలపై, ఆరేళ్ళుగా అలుపెరగకుండా చేసిన ఈ అమ్మాయిల పోరాటంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.