డిజిటల్ పేమెంట్స్ వినియోగం పెరిగాక నగదు లావాదేవీలు జరగుతుండడం అన్నది చాలా అరుదుగా కనిపిస్తోంది. పాల ప్యాకెట్ డబ్బులివ్వాలన్నా.. పేపర్ బిల్లు కట్టాలన్నా.. గ్యాస్, వాటర్, కరెంట్.. ఇలా ప్రతి ఒక్క చెల్లింపులు ఆన్ లైన్ ద్వారానే జరిగిపోతున్నాయి.. అంతేకాదు.. ఈ యాపుల పుణ్యమా అని బ్యాంకులకు వెళ్లే బాధ కూడా తప్పింది. క్షణాల్లో అవతలి వారికి డబ్బులు పంపగలుగుతున్నాం. ఫోన్ మన దగ్గర ఉన్నంతవరకు వీటన్నిటికి డోకాలేదు. మరి ఫోన్ పోయినపుడు ఏం చేయాలి?
ఫోన్ పోయినా.. దానికి పాస్వర్డ్ లేదా పిన్ ఉందికదా! భద్రంగా ఉంటుందిలే మీరు అనుకోవచ్చు. 300 రూపాయిలు చెల్లిస్తే మీ ఫోన్ లాక్ ఓపెన్ చేయిస్తారు. యాప్స్ ఇన్స్టాల్ చేసి మీ మొబైల్ నెంబర్ కొట్టగానే.. టిక్ టిక్ మని సెకండ్లలో మెసేజులు వస్తాయి. ఈ విషయాన్ని మరువకూడదు. అందువల్ల డిజిటల్ పేమెంట్స్ అకౌంట్స్ ను వెంటనే బ్లాక్ చేయాలి. అందుకోసం గూగుల్ లో వెతికి మోసపోకుండా.. ఇక్కడిచ్చిన నెంబర్లను సేవ్ చేసుకొని భవిష్యత్ అవసరాలకు ఉపయోగించుకోవాలి. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అకౌంట్లను ఎలా బ్లాక్ చేయాలన్నది ఇప్పుడు చూద్దాం..
గూగుల్ పే యూజర్లు.. మొదట గూగుల్ పే హెల్ప్‌లైన్ నెంబర్ 1800 4190 157కు కాల్ చేయాలి. మీకు నచ్చిన మాతృభాషను ఎంచుకోవాలి. ఆపై మనకు కావాల్సిన ఎంపికను ఎంచుకోవాలి. అంటే.. ఖాతాను బ్లాక్ చేసేందుకు కాల్ మాట్లాడే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. ఆ తరువాత కాల్ కనెక్ట్ అయ్యాక.. వారికి మీ సమస్యను వివరించి మీ గూగుల్ పే అకౌంట్ ను బ్లాక్ చేయవచ్చు.
ఫోన్ పే యూజర్లు .. 0806 8727 374 నెంబర్ కు కాల్ చేసి వివరాలను తెలపాలి. మొదట మాతృ భాషను ఎంపిక చేసుకొని.. సమస్యను వివరించేందుకు సరైన ఎంపికను ఎంచుకోవాలి. ఆ తరువాత ఫోన్ పే రిజిస్టర్ అయి ఉన్న మెుబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ధ్రువీకరణ కోసం ఓటీపీ వస్తుంది. ఇక్కడ ఓటీపీ రాలేదనే ఆప్షన్‌ను ఎంపిక చేయాలి. ఫోన్ పోయినట్లు చూపే ఆప్షన్లలో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఫోన్ నంబర్, ఈ-మెయిల్ ఐడి, ఈ అకౌంట్ ద్వారా చేసిన చివరి చెల్లింపు విలువ వంటి వివరాలను అడుగుతుంది. ఇవన్నీ సరితూగితే.. మీ అకౌంట్ బ్లాక్ చేసేందుకు వారి నిపుణులతో కాల్ మాట్లాడాడానికి అనుమతిస్తుంది. ఆ తరువాత వారికి మీ సమస్యను వివరించి మీ ఫోన్ పే అకౌంట్ ను బ్లాక్ చేయవచ్చు.
పేటీఎం యూజర్లయితే.. పేటీఎం హెల్ప్‌లైన్ నంబర్ 012 0445 6456కు కాల్ చేయాలి. ఫోన్ లాస్ట్ ఆప్షన్ ఎంచుకోవాలి. న్యూ నంబర్ నమోదు ఆప్షన్ ను ఎంచుకోవాలి. పోయిన ఫోన్ నంబర్ ను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత లాగ్ అవుట్ ఫ్రం ఆల్ డివైసెస్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడితో వదిలివేయకుండా మీ మొబైల్ నెంబర్ ను కూడా వీలైనంత త్వరగా బ్లాక్ చేపించాలి.
స్మార్ట్ ఫోన్ పోయినప్పుడు అందులో ఉన్న గూగుల్ పే, ఫోన్ పే లేదా PayTm వంటి వాలెట్ లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసా? pic.twitter.com/IYmTGO1abd
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) November 9, 2022