డెలివరీ బాయ్స్ ఎండనక, వాననక రోజంతా ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. రోజూ వందకు పైగా కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంటారు. సమయానికి ఫుడ్ డెలివరీ చేస్తుంటారు. అయితే వీరి కష్టానికి తగిన ఫలితం దక్కింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ తమ ఉద్యోగులకు రూ. 31 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బుతో వారి కోసం?
ఫుడ్ డెలివరీ బాయ్స్ ఎంత కష్టపడతారో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. చాలా మంది పేదలు, దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకులే ఈ జాబ్ ఎంచుకుంటారు. కొంతమంది చదువుతూ పార్ట్ టైం చేస్తుంటారు. మరి కొంతమంది ఫుల్ టైం ఇదే పని చేస్తుంటారు. ఒక్కోసారి తినడానికి కూడా టైం ఉండదు. అంతలా అంకితభావంతో పని చేస్తారు. డిగ్రీలు, ఇంజనీరింగ్ లు చేసిన వారు కూడా డెలివరీ బాయ్స్ గా చేస్తున్నారు. అయితే వీరికి దక్కాల్సిన గుర్తింపు, గౌరవం అనేది దక్కడం లేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. వినియోగదారుల నుంచి గుర్తింపు, గౌరవం అటుంచితే.. అసలు ఫుడ్ డెలివరీ సంస్థల నుంచి తమ ఉద్యోగుల పట్ల ఎలాంటి బాధ్యత ఉందన్నది ప్రశ్నార్థకం.
డెలివరీ సమయంలో వారికి ఏమైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆరోగ్యం బాగోపోతే ఎలా? కంపెనీలన్నాక ఉద్యోగులకు ప్రమాద బీమా, ఆరోగ్య బీమా వంటివి ఇవ్వాలి. కొన్ని ఇస్తాయి. కొన్ని ఇవ్వవు. అయితే తాజాగా స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థ.. డెలివరీ ఏజెంట్లకు ఆరోగ్య బీమా, ప్రమాద బీమా ఇచ్చేందుకు రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2015 నుంచి ఆరోగ్య బీమా సహా ఇతర ప్రయోజనాలను అందిస్తున్న స్విగ్గీ.. ఈ మేరకు ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 31 కోట్ల బీమా క్లెయిమ్ ల కోసం చెల్లించింది. దేశవ్యాప్తంగా ఉన్న 3 లక్షల మంది స్విగ్గీ డెలివరీ ఏజెంట్లకు బీమా కల్పించనుంది. ఆరోగ్య బీమా, వ్యక్తిగత ప్రమాద బీమా, మొబైల్ ఫోన్ ఇన్సూరెన్స్ కవరేజీని డెలివరీ ఏజెంట్లకు అందించనుంది. గ్రూప్ మెడిక్లెయిమ్ పాలసీ కింద అవుట్ పేషెంట్ చికిత్స, ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స, మెటర్నిటీ కవరేజీ వంటి ప్రయోజనాలు ఆరోగ్య బీమాలో ఉన్నాయి.
ప్రమాదం జరిగి పాక్షిక వైకల్యం ఏర్పడితే ఆ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. శాశ్వత వైకల్యం ఏర్పడితే పరిహారం చెల్లిస్తారు. ప్రమాదంలో మరణం సంభవిస్తే రూ. 10 లక్షల పరిహారం చెల్లిస్తారు. ప్రమాదం కారణంగా మొబైల్ ఫోన్ డ్యామేజ్ అయితే రూ. 5 వేలు పరిహారం ఇస్తారు. స్విగ్గీ డెలివరీ ఏజెంట్లంటే ఉద్యోగులు కాదు, వారికి ఎటువంటి హెల్త్ సపోర్ట్ ఉండదన్న అపోహ ఉందని, అయితే తాము చాలా సంవత్సరాలుగా బీమా మరియు ఇతర ప్రయోజనాలు డెలివరీ ఏజెంట్లకు, వారి కుటుంబాలకు అందించామని స్విగ్గీ ఆపరేషన్స్ హెడ్ మిహిర్ షా వెల్లడించారు. 2022-23 సంవత్సరంలో స్విగ్గీ తన డెలివరీ ఏజెంట్లకు రూ. 31 కోట్ల బీమా క్లెయిమ్ చెల్లింపులకు సాయం అందించినట్లు కంపెనీ తెలిపింది.