బ్యాంకులో మీకు లాకర్ ఉందా? నగదు భద్రపరచుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇకపై నగదు భద్రపరచుకోవడం కుదరదు. ఆర్బీఐ కొత్త నిబంధనలకు అనుగుణంగా నడుచుకోకపోతే లాకర్లు సీజ్ చేసే అవకాశం ఉంది.
లాకర్లు ఉన్న వినియోగదారులు బ్యాంకుతో కొత్త ఒప్పందం చేసుకోవాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇందుకోసం రూ. 200 స్టాంపు పత్రాలపై నోటరీ చేయించి బ్యాంకులో ఇవ్వాలని తెలిపింది. నిజానికి కొత్త ఒప్పందాలకు సంబందించిన గడువు జనవరి 1తోనే ముగిసింది. కొన్ని బ్యాంకులు ఒప్పందం చేసుకోని వినియోగదారుల లాకర్లను సీజ్ చేశాయి కూడా. అయితే చాలా మంది ఒప్పందం చేసుకోకపోవడంతో గడువు తేదీని డిసెంబర్ 31 వరకూ పొడిగిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సీజ్ చేసిన లాకర్లను తిరిగి వినియోగించుకునే సదుపాయాన్ని వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది.
కొత్త ఒప్పందాల విషయంలో దశల వారీగా బ్యాంకులకు లక్ష్యాలను పెట్టింది. వచ్చే జూన్ 30 నాటికి 50 శాతం, సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం, డిసెంబర్ 31 నాటికి నూటికి నూరు శాతం మంది ఖతాదారులతో ఒప్పందాలు పూర్తి చేయాలని ఆర్బీఐ స్పష్టం చేసింది. గడువు తేదీ గురించి ఖతాదారులకు సమాచారం తక్షణమే పంపాలని బ్యాంకులకు సూచించింది. కొత్త ఒప్పందం ప్రకారం వినియోగదారులు లాకర్లలో నగదు దాచుకోకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. లాకర్ కేటాయించే సమయంలో కస్టమర్లకు సంబంధించిన పూర్తి వివరాలను బ్యాంకులు నమోదు చేయాలని ఆర్బీఐ సూచించింది. ఈ లాకర్ సదుపాయాన్ని పొందేందుకు ఏటా చెల్లించవలసిన నిర్వహణ సొమ్మును అంతమేర వడ్డీ వచ్చేలా ముందుగానే ఖాతాదారులతో డిపాజిట్ చేయమని కొన్ని బ్యాంకులు కోరుతున్నాయి.
ఉదాహరణకు లాకర్ వార్షిక నిర్వహణకు రూ. 1000 చెల్లించాల్సి ఉంటే అంత సొమ్ము రావడానికి కనీసం రూ. 2 లక్షలు డిపాజిట్ చేసిన వారికే లాకర్ ను కేటాయిస్తున్నట్లు హైదరాబాద్ కు చెందిన ఓ బ్యాంకు మేనేజర్ తెలిపారు. గతంలో లాకర్లు తీసుకున్నవారిలో నెలలు, ఏళ్ల తరబడి లాకర్లను తెరవాలేదని.. వాళ్ళు ఖచ్చితంగా కొత్త ఒప్పందం చేసుకోవాలని సూచించారు. గతంలో పెద్ద నోట్ల రద్దు సమయంలో లాకర్ల నుంచి నోట్ల కట్టలు బయటకు తెచ్చి మార్చుకున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇందుకే నగదు విషయమై లాకర్ల నిబంధనల్లో ఆర్బీఐ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. లాకర్లలో నగదు నిల్వలను అరికట్టాలని బ్యాంకులకు సూచించింది. లాకర్లలో ఏమేం దాచుకోవాలి, ఏమేం పెట్టకూడదనే అంశాలపై ఆర్బీఐ స్పష్టత ఇచ్చింది.
ఖాతాదారుల నుంచి చిరునామా, ఇతర వివరాలు ఏమీ మారలేదని సెల్ఫ్ డిక్లరేషన్ (స్వయం ధ్రువీకరణ) పత్రాన్ని ప్రతీ బ్యాంకు తప్పనిసరిగా తీసుకోవాలని ఆర్బీఐ సూచించింది. అయితే ఖాతాదారులను బ్యాంకుకు పిలవాల్సిన అవసరం లేదని.. ఈమెయిల్ ద్వారా గానీ లేదా ఏటీఎంలో గానీ, రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి గానీ, నేటి బ్యాంకింగ్ ద్వారా ఆన్ లైన్ లో గానీ డిజిటల్ విధానంలో డిక్లరేషన్ పత్రాన్ని సేకరించాలని ఆర్బీఐ సూచించింది. ఒకవేళ లాకర్ వినియోగదారుల చిరునామా మారితే గనుక.. అందుకు సంబంధించిన ఆధార్, ఓటర్ కార్డు వంటి గుర్తింపు కార్డులను ఆన్ లైన్ లో స్వీకరించి కేవైసీ వివరాలు అప్ డేట్ చేయాలని బ్యాంకులకు సూచించింది. చిరునామా మారిన వివరాల పత్రాలను ఖాతాదారులు ఆన్ లైన్ లో పంపిన రెండు నెలల్లోగా తనిఖీ పూర్తి చేయాలని బ్యాంకులకు స్పష్టం చేసింది. మరి ఆర్బీఐ కొత్త ఒప్పందంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.