భవిష్యత్ అవసరాల కోసం పొదుపు చేయాలని చూస్తున్నారా..? ఎందులో పొదుపు చేస్తే ఎక్కువ రాబడి వస్తుందో తెలియడం లేదా..? అయితే ఈ సమాచారం మీకోసమే. బ్యాంకుల్లో డబ్బు దాచుకునేవారు ఈ కథనాన్ని తప్పక చదవండి.
కష్టపడి సంపాదించడం.. అందులో నాలుగు రాళ్లు భవిష్యత్ అవసరాల కోసం దాచుకోవడం అందరూ చేసే పనే. కానీ ఆ డబ్బును సరైన ఆదాయం వచ్చేలా ఉంచగలుగుతున్నారా? అన్నది ఆలోచించాల్సిన విషయం. సాధారణంగా అందరూ డబ్బు దాచుకోవడం అంటే బ్యాంకు సేవింగ్స్ ఎకౌంట్/ ఫిక్స్డ్ డిపాజిట్/ రిక్కరింగ్ డిపాజిట్ వంటివి చూస్తారు. ఎందుకంటే వీటిలో డబ్బు సేఫ్ గా ఉంటుంది కనుక. అయితే ఇక్కడ ఎక్కువ వడ్డీ ఎలా పొందవచ్చా అన్నది ఆలోచించుకోవాలి.
ఉదాహరణకు ఫిక్స్ డ్ డిపాజిట్ తీసుకొని.. పోస్టాఫీసులో ఎంత రాబడి వస్తోంది, బ్యాంకులో ఎంత రాబడి వస్తుందో తెలుసుకుందాం..
పోస్టాఫీసులు/బ్యాంకులు రెండు సురక్షితమైనవే కావున ఇందులో రాబడి ఎక్కువో తెలుసుకొని అందులో ఇన్వెస్ట్ చేయడం మంచిది. వాస్తవానికి బ్యాంకుల్లో నిర్ణీత సమయం డిపాజిట్ చేసిన డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. అదే పోస్టాఫీసులో డిపాజిట్ చేసిన మొత్తాన్ని టైమ్ డిపాజిట్లు అంటారు. మీరు 5 సంవత్సరాల కాలానికి పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ చేస్తే 7.5 శాతం చొప్పున వడ్డీ లభిస్తోంది. అదే ఎస్బీఐలో డిపాజిట్ చేశారనుకుంటే 6.50 శాతం వడ్డీ లభిస్తుంది.
ఇప్పుడు రెండు ఫిక్స్డ్ డిపాజిట్ల మధ్య తేడా గమనిస్తే పోస్టాఫీసు కాస్త మెరుగ్గానే కనిపిస్తోంది. అలాగే ఏడాది కాలవ్యవధి ఉన్న పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుండగా, ఎస్బీఐలో ఏడాది లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ లభిస్తోంది. ఇక రెండేళ్ల కాలవ్యవధి ఉన్న పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లపై 6.9 శాతం వడ్డీ లభిస్తుండగా, ఎస్బీఐలో ఏడాది నుండి రెండేళ్ల లోపు ఉన్న లోపు ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.80 శాతం వడ్డీ లభిస్తోంది. ఈ గణాంకాలను బట్టి ఎక్కువ రాబడి కోసం ఆలోచిస్తున్నట్లయితే పోస్టాఫీసు ఉత్తమమని చెప్పవచ్చు.
పోస్టాఫీస్‌లో చేసే ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో.. డిపాజిట్ చేసిన తేదీ నుంచి ఆరు నెలల వరకు ప్రీమెచూర్ విత్‌డ్రా ఆప్షన్ లేదు. ఆరు నెలల తర్వాత నుండి ఒక సంవత్సరం ముందు వరకు అకౌంట్ మూసివేస్తే.. ఆ ఎఫ్డీపై పోస్టాఫీసు సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రేటు వర్తిస్తుంది. అదే ఎస్బీఐ విషయానికొస్తే.. ఎఫ్డీని గడువుకు ముందు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే దీనిపై పెనాల్టీ వర్తిస్తుంది.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కొరకు మాత్రమే. ఇందులో పొదుపు/పెట్టుబడి పెట్టాలన్నది మీ వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఈ కథనం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఒక సంస్థను కించపరచాలన్నది కాదు.