మనిషి జీవితాన్ని నడిపే ఇంధనం.. ధనం. ఈ భూమ్మీ మీద మన మనుగడ సాగాలంటే.. గాలి, నీరు, ఆహారంతో పాటు కావాల్సిన మరో అతి ముఖ్యమైన వనరు డబ్బు. చేతిలో రూపాయి లేకపోతే.. బయట కాలు పెట్టలేం. ఇక పట్టణాల్లో జీవించే వారి ఖర్చుల గురించి ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువ. ఇలా నెల మొత్తం సంపాదించిన జీతం ఖర్చులకే సరిపోకపోతే.. ఇక పొదుపు గురించి ఏం ఆలోచిస్తాం. ఏదో ఉన్నంతలో ఒకరి దగ్గర చేయి చాచకుండా.. భవిష్యత్ అవసరాల కోసం కొంత మొత్తంలో పొదుపు చేయడం చాలా ఉత్తమం. అలాంటి వారి కోసం ఓ అద్భుతమైన స్కీమ్‌ను పరిచయం చేస్తున్నారు ఆర్థిక నిపుణులు. వారు చెప్పిన వివరాల ప్రకారం నెలకు రూ.1000 పొదుపు చేస్తే.. భవిష్యత్ లో లక్షాధికారులు కావొచ్చు. వెయ్యి రూపాయలు పొదుపు చేస్తే లక్షాధికారులు ఎలా అవుతాం అని ఆలోచిస్తున్నారా?.. అయితే ఈ కథనం చదవండి. పూర్తి వివరాలు తెలుస్తాయి.
ప్రస్తుత కాలంలో పొదుపు గురించి ఆలోచించే వారు ఎంచుకునే మార్గం సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్). మీరు కోట్వీశరులు కావాలన్నా.. పిల్లల భవిష్యత్ కోసం పొదుపు చేయాలనుకుంటున్నా.. వెంటనే సిప్ లో పొదుపు చేయడం ప్రారంభించడండి. దీనిలో రెగ్యులర్ ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు. తక్కువ పొదుపుతో ఎక్కువ రాబడి ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలకు రూ. 1000 పొదుపు అనేది చాలా మందికి పెద్ద విషయం కాదని చెప్పుకోవచ్చు. అంటే రోజుకు 30 రూపాయలు అన్నమాట. ఇంత చిన్న మొత్తం పొదుపుతో మీరు దీర్ఘకాలంలో లక్షాధికారులు కావొచ్చు.
ఇందుకోసం.. మీరు 30 ఏళ్ల పాటు నెల నెలా.. రూ. 1,000 పొదుపు చేయాలి. ఈ పథకంలో గత కొన్నేళ్లలో చాలా మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు 20 శాతం వరకు రాబడిని అందించాయి. కనీసం 15 శాతం అనుకున్నా.. 30 ఏళ్ల పాటు నెలకు రూ.1,000 పొదుపు చేస్తే రూ. 70 లక్షల వరకు ఆదాయాన్ని పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంకా పెద్ద మొత్తంలో రాబడి కావాలనుకుంటే.. స్టెప్ అప్ సిప్ ను ఎంచుకోవచ్చు. ఇందులో పొదుపు మొత్తాన్ని కొంత మొత్తంలో పెంచుకుంటూ అధిక రాబడి పొందవచ్చు. ఉదాహరణకు మీరు మొదటి సంవత్సరం నెలకు రూ. 1,000 ఆదా చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం 5 శాతం స్టెప్-అప్‌ని ఎంచుకోవచ్చు. 5% స్టెప్ అప్ ఆప్షన్‌తో, రెండవ సంవత్సరంలో మీ పొదుపు దాదాపు రూ. 1,050 అవుతుంది. మీరు 10 శాతం స్టెప్-అప్ ఎంపికను ఎంచుకుంటే, మీరు రెండవ సంవత్సరానికి నెలకు రూ. 1,100 చెల్లించాల్సి ఉంటుంది. అయితే 30 ఏళ్ల పాటు డబ్బులు పెట్టడం అంటే కష్టమైన పనే. కానీ, పెద్ద మొత్తం కాదు కనుక ట్రై చేయొచ్చు. పిల్లల భవిష్యత్ కోసం సిప్ చేయడం ప్రారంభిస్తే.. వారి పెళ్లి, ఉన్నత చదువులకు వెళ్లే సమయానికి ఈ మొత్తం ఉపయోగపడొచ్చు.
కాకపోతే, మ్యూచువల్ ఫండ్స్‌లో కూడా రిస్క్ ఉంటుంది. అందుకే మీరు డబ్బులు పెట్టేటప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం అంటున్నారు మార్కెట్ నిపుణులు. అంతేకాక మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్‌మెంట్లు కూడా మార్కెట్ రిస్క్‌కు లోబడే ఉంటాయని చెప్పుకోవాలి. అందుకే డబ్బులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. లేదంటే రిస్క్ లేనటువంటి పోస్టాఫీస్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిల్లో కచ్చితమైన రాబడి పొందొచ్చు. పీపీఎఫ్ సహా పలు రకాల సేవింగ్స్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు బ్యాంక్‌లో కూడా సేవింగ్ స్కీమ్స్ బెనిఫిట్స్ పొందొచ్చు.
గమనిక: ఇది డబ్బు ఆదా, పెట్టుబడికి సంబంధించి సలహా మాత్రమే. మీరు పెట్టుబడి పెట్టే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.