మధ్యతరగతి బతుకులు. జీవితం నిండా గతుకులు. ఎన్ని ఉన్నా గానీ సొంత ఇల్లు కట్టుకోవాలి అన్న ఆశ అంత త్వరగా వదిలిపెట్టదు. మధ్యతరగతి బతుకులు కదా.. ఆ మాత్రం ఆశ ఉండిద్దిలే. అయితే చాలీచాలని జీతం, వచ్చే అరాకొరా డబ్బులతో ఇల్లు కట్టి నలిగిపోతున్న మధ్యతరగతి మనుషులు ఎందరో ఉన్నారు. అయితే సొంతింట్లో ఉంటే ఆ కిక్కే వేరు కదా అని సంతృప్తి చెందుతున్నారు. మరి కొంతమంది బోలెడంత డబ్బు ఖర్చు పెట్టి అంతగా అభివృద్ధి చెందని ప్రదేశాల్లో ఇల్లు కట్టడమో, కొనడమో చేసి.. అనవసరంగా కట్టామే అని బాధపడుతుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో అద్దె డబ్బులను ఈఎంఐగా మార్చుకుని ఇల్లు కొనుక్కోవడం మంచిదేనా?
సొంత ఇల్లు కట్టుకోవాలి అనేది ఒక ఎమోషన్. ప్రతి ఒక్కరికీ సొంత ఇల్లు ఉంటే బాగుంటుందన్న ఫీలింగ్ ఉంటుంది. అయితే రుణం తీసుకుని కట్టాలా? నెల నెలా ఈఎంఐ ఎక్కువ ఉంటుంది కదా.. లోన్ గడువు ముగిసే సమయానికి తీసుకున్న లోన్ మీద రెట్టింపు డబ్బులు కడుతున్నాం కదా అని అనుకుంటారు. కాబట్టి లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడం కంటే ఎవరో కట్టిన ఇంట్లో నెల నెలా ఈఎంఐలో సగం డబ్బు అద్దె రూపంలో చెల్లిస్తే సొంతింట్లో ఉన్నట్టే ఉండచ్చు కదా అని అనుకుంటారు. సొంతిల్లు, అద్దె ఇల్లు.. పెద్ద తేడా ఏముందిలే అని సర్దుకుపోదామని అనుకుంటారు. మరి కొంతమంది మాత్రం అద్దె డబ్బులతో ఈఎంఐ కట్టుకోవచ్చు అని అనుకుంటారు. అసలు ఏది ఉత్తమం? కిరాయి ఉంటున్న ఇంటికి కట్టే అద్దె డబ్బులను ఈఎంఐగా మార్చుకుని సొంతిల్లు కట్టుకోవడం మంచిదా? కాదా?
అద్దె చెల్లించే బదులు ఆ డబ్బులతో సొంత ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అనిపిస్తుంది. వచ్చే జీతం ఆధారంగా లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవడమో, కొనుక్కోవడమో చేయాలని అనుకుంటారు. అయితే ఆర్బీఐ రెపో రేట్లు పెంచిన ప్రతిసారీ గృహ రుణాల ఈఎంఐలు పెరిగిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈఎంఐలో ఇల్లు కొనుక్కోవడం మంచిదా? కాదా? అన్న డైలమాలో పడిపోతారు. అసలు ఇల్లు కొనుక్కోవాలి అనే ఎమోషన్ ని క్యారీ చేసే ముందు పర్సనల్ ఫైనాన్స్ సూత్రాన్ని అనుసరించి ఆలోచించాల్సి ఉంటుంది. పర్సనల్ ఫైనాన్స్ సూత్రం ప్రకారం ఎటువంటి ఆర్థిక లక్ష్యానికి కూడా భావోద్వేగాలను జోడించకూడదు. ఆర్థిక లక్ష్యాలు అంటే పిల్లల చదువులు కావచ్చు, పిల్లల కోసం చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, వేరే అప్పులు ఏమైనా కావచ్చు, ఇతర లోన్లు కావచ్చు ఇలా ఆల్రెడీ కొన్ని ఆర్థిక లక్ష్యాలు ఉంటాయి. వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సొంత ఇల్లు అనేది కూడా ఆర్థిక లక్ష్యమే. అయితే దీని కోసం వేరే ఆర్థిక లక్ష్యాన్ని అశ్రద్ధ చేస్తున్నామా అనేది ఆలోచించాలి. అశ్రద్ధ చేస్తున్నట్టు అనిపిస్తే కనుక సొంతింటి ఆలోచనను వదులుకోవడమే మంచిది.
ఇల్లు కట్టడం అనేది మాకు పెట్టుబడి మార్గం అని అనుకుంటే గనుక.. ఇల్లు కట్టే ప్రాంతంలో అద్దె పెరుగుదల వృద్ధి ఎలా ఉందో అనేది గమనించాలి. రద్దీ ఎక్కువగా ఉన్న ఏరియాల్లో కూడా కొన్నేళ్ల తర్వాత అద్దె అనేది పెరగదు. వార్షిక వృద్ధి.. ద్రవ్యోల్బణం కంటే తక్కువ ఉంటే అది మంచి పెట్టుబడి మార్గం కాదని గమనించాలి. ఎందుకంటే ఇంటి హోమ్ లోన్ అనేది ద్రవ్యోల్బణం కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది.
అద్దె డబ్బుల కంటే హోమ్ లోన్ కోసం కట్టే ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం మీరు కట్టే అద్దె డబ్బులతోనే హోమ్ లోన్ కి ఈఎంఐ కట్టాలనుకుంటే మీరుంటున్న నగర శివారులోనో, సదుపాయాలు అంతగా లేని ప్రాంతాల్లోనో ఇల్లు కొనుక్కోవాల్సి వస్తుంది. లేదంటే ఇంటికి అయ్యే ఖర్చులో సగం డబ్బు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. అలా అయితే హోమ్ లోన్ ఈఎంఐ తక్కువ ఉంటుంది.
మీ దగ్గర డబ్బు లేదు. మొత్తం హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనాలనుకుంటే గనుక.. దీని కంటే ముందు ఒక పని చేస్తే మంచిదని చెబుతారు. అదేంటంటే.. మీ ఆదాయం నుంచి ఎలాగూ హోమ్ లోన్ ఈఎంఐ కోసం కొంత డబ్బు పక్కన పెడదాం అనుకున్నారు కదా. ఆ డబ్బుని కొన్నాళ్ల పాటు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ లో పెట్టుబడులు పెట్టడం వల్ల మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఆ డబ్బు ఇల్లు కట్టుకోవడానికి కొంత వరకూ ఉపయోగపడుతుంది. మిగతా మొత్తం కోసం హోమ్ లోన్ పెట్టుకుంటే ఈఎంఐ భారం అనేది తగ్గుతుంది. ఈఎంఐ భారం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది అని చెబుతారు. అయితే ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే లాభం, ఇటు రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఇల్లు కొనాలనుకునే ఉద్యోగులు ఇంటి ధరలో అధిక భాగం హోమ్ లోన్ తీసుకుని నెల నెలా ఈఎంఐ చెల్లిస్తారు. అసలు సొంత ఇల్లు నిర్ణయం మంచిదా? కాదా? అని అర్థం చేసుకోవడానికి హోమ్ లోన్ ఎలాంటిది అనేది ఆలోచించాలి.
ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, పలు ఆర్థిక సంస్థలు గృహ రుణాలు అందిస్తున్నాయి. ప్రస్తుతం హోమ్ లోన్ మీద ఏడాదికి వడ్డీ 8.5 శాతంకి అటు ఇటుగా ఉంది. అయితే ఇది ఆర్బీఐ రెపో రేటు మీద ఆధారపడి ఉంటుంది. తక్కువ రెపో రేటు ఉన్నప్పుడు గృహ ఋణం తీసుకుంటే బ్యాంకులో జమ చేసే వడ్డీ తగ్గుతుంది. గత ఏడాదిగా రెపో రేటు అనేది పెరిగిపోతుండటం వల్ల గృహ రుణాల వడ్డీ కూడా పెరిగిపోతుంది. 2022 జూన్ లో 5.4% ఉన్న రెపో రేటు.. ఇప్పుడు 6.5 శాతంగా ఉంది. దీంతో 2022లో 8 శాతం ఉన్న ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటు ఇప్పుడు 9.4 శాతానికి పెరిగింది. అయితే ఋణం తీసుకునేవారి సిబిల్ స్కోర్ బాగుంటే వడ్డీ రేట్లు తక్కువ ఉండచ్చు. లేదంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.
వడ్డీ రేట్లతో పాటు గమనించాల్సిన అంశం ప్రీ పేమెంట్. వడ్డీ మాత్రమే కాకుండా బ్యాంకులు కొన్ని నిబంధనలు కూడా పెడతాయి. అవన్నీ గమనించి గృహ ఋణం తీసుకోవడం మంచిది. చాలా బ్యాంకులు గృహ ఋణం కాలపరిమితి దాటక ముందే లోన్ క్లియర్ చేస్తామంటే ఫోర్ క్లోజింగ్ ఛార్జెస్ పేరుతో పెనాల్టీ విధిస్తాయి. దీని వల్ల కొంచెం నష్టం ఉంటుంది. ఒకవేళ ఇటువంటి బ్యాంకులు వడ్డీ తక్కువ అయితే కనుక లోన్ తీసుకోవచ్చు. కొన్ని బ్యాంకులు లోన్ తీసుకున్న వారి పేరు మీద పొదుపు ఖాతాలు తెరుస్తాయి. ఇటువంటి సమయంలో పొదుపు ఖాతాల్లో ఉన్న డబ్బును హోమ్ లోన్ మొత్తంలో తగ్గించుకుని మిగతా దానికి మాత్రమే వడ్డీ విధిస్తాయి. దీని వల్ల మీరు తీసుకున్న గృహ రుణానికి పూర్తి మొత్తం వడ్డీ కట్టే పరిస్థితి ఉండదు.
అయితే కొన్ని బ్యాంకులు హోమ్ లోన్ ఇచ్చే ముందు కస్టమర్లకు ఇంటి మీద బీమా పాలసీని అమ్మే ప్రయత్నం చేస్తాయి. ఇంటి లోన్ తో పాటు బీమా పాలసీ తీసుకోవాలన్న నియమం ఐఆర్డీఏ లేదా ఆర్బీఐ నిబంధనల్లో లేదు. కాబట్టి బీమా పాలసీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని బ్యాంకులు పాలసీ తీసుకుంటే రక్షణగా ఉంటుందని చెబుతాయి. కానీ ఇవి అంత లాభసాటి కాదు. ఎందుకంటే వ్యక్తిగత టర్మ్ పాలసీ కోసం కట్టే ప్రీమియం ఈ హోమ్ లోన్ మీద తీసుకునే బీమా పాలసీ కంటే తక్కువ ఉంటుంది.
మొత్తం మీద అద్దె ఇంట్లో ఉండాలా? లేక అద్దె కట్టే బదులు హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కట్టుకోవాలా? అనే విషయం మీద స్పష్టత రావాలంటే.. పర్సనల్ ఫైనాన్స్ సూత్రం, పెట్టుబడి మార్గం, హోమ్ లోన్ వడ్డీ రేట్లు, ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్స్, ప్రీ పేమెంట్ అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఆదాయం బాగా ఉన్న వారికి ఈ అంశాలు ఏమీ లెక్కలోకి తీసుకునే పని ఉండదు. కానీ మధ్యతరగతి వారే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జీవితాంతం ఈఎంఐలు కట్టుకుంటూ కూర్చుంటే జీవితంలో జీవితం కాదు, ఈఎంఐలే ఉంటాయి. మీ ఆదాయం తక్కువ అనుకుంటే మీరు ఇంటి మీద పెట్టుబడి పెట్టడం కంటే పిల్లల భవిష్యత్తు మీద పెట్టడం మంచిది. పిల్లలకు మంచి చదువు ఇవ్వడాన్ని మించిన ఆస్తి మరొకటి లేదు. ఇంటి కోసం పెట్టే లక్షలను పిల్లల చదువు కోసం ఉపయోగిస్తే మంచిదన్న అభిప్రాయాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇల్లైనా వారికే ఇవ్వాలి. చదువైనా వారికే ఇవ్వాలి. ఇల్లు విలువ 50 ఏళ్ళు. చదువు విలువ పిల్లలు ఉన్నన్ని ఏళ్ళు. ఏది మంచిదో నిర్ణయించుకోమని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమే. ఇల్లు కట్టుకోవాలా? లేదా? అనే అంశాల మీద నిర్ణయం తీసుకునే ముందు నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.