వంట నూనె ధరలు భారీగా తగ్గాయి. వేరుశనగ నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ వంటి ఆయిల్ ప్యాకెట్ల ధరలు తగ్గాయి. ఎంత మేర తగ్గిందంటే?
నిత్యావసర సరుకుల ధరలు మండిపోతున్నాయి. వంట నూనె, పప్పులు, ఉప్పులు అన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇన్ని రోజులూ వంట నూనె ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. కొనాలంటేనే ఆలోచించే పరిస్థితి. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారికైతే వంట నూనె కొనాలంటే పిడుగు పడ్డట్టు ఉండేది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే వంట నూనె ధరలు దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలు తగ్గుతున్నాయి. ఈ క్రమంలో దేశీయంగా కూడా ధరలు తగ్గించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వంట నూనె ధరలకు అనుగుణంగా దేశీయ మార్కెట్లో కూడా తగ్గించాలని ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సూచించింది.
దీంతో పలు ఆయిల్ కంపెనీలు వంట నూనె ధరలను తగ్గించే యోచనలో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ వినత నూనె ధరను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. లీటరుపై రూ. 15 నుంచి రూ. 20 తగ్గించినట్లు పేర్కొంది. ఈ ధరల తగ్గింపు తక్షణమే అమల్లోకి వచ్చిందని పేర్కొంది. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశీయంగా వంట నూనె ధరలను తగ్గించాలని ఆహార మంత్రిత్వ శాఖ.. వంట నూనెల పరిశ్రమ సంఘానికి ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ ఆయిల్ కంపెనీ మదర్ డెయిరీ వంట నూనె ధరల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంది. లీటరు వంట నూనెపై ఎంఆర్పీ ధర మీద రూ. 15 నుంచి రూ. 20 తగ్గిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.
ఈ సవరించిన ఎంఆర్పీ ధరలతో ఆయిల్ ప్యాకెట్లు వచ్చే వారం నుంచి అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఈ మార్పుల ఫలితంగా లీటరు రిఫైండ్ సోయాబీన్ నూనె రూ. 170 నుంచి రూ. 150కి తగ్గింది. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ రూ. 190 నుంచి రూ. 170కి తగ్గింది. రిఫైండ్ సన్ ఫ్లవర్ నూనె రూ. 170 నుంచి రూ. 165కు తగ్గగా, వేరుశనగ నూనె రూ. 255 నుంచి రూ. 245కి తగ్గింది. దీంతో వినియోగదారులకు కాస్త ఊరట లభించింది. ఈ కంపెనీ బాటలోనే మిగతా ఆయిల్ కంపెనీలు కూడా త్వరలో ధరలను తగ్గించే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే సామాన్య, మధ్యతరగతి వ్యక్తులకు మేలు జరిగినట్టే. దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.