కొత్త ఇల్లు కొనేందుకు మీరు కొంత అమౌంట్ సర్దుబాటు చేసుకుంటారు. తీరా కొన్నాక అదనంగా కొన్ని ఛార్జీలు ఉంటాయని తెలిసి చాలా బాధపడతారు. అందుకే ఇల్లు కొనేముందు అన్ని ఛార్జీలతో కలిపి ఎంత అవుతుందో తెలుసుకోండి.
కొత్త ఇల్లు కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లేదంటే కొనేముందు ముందే ఎందుకు తెలుసుకోలేదని చాలా బాధపడతారు. నిరాశ చెందుతారు. ఎందుకంటే ఇల్లు కొనడం కోసమని ఎంతో కష్టపడి డబ్బు పోగుజేసుకుంటారు. తీరా డబ్బు పోగయ్యాక ఇల్లు కొనుక్కోవాలనుకుంటారు. అయితే ఇల్లు కొనడానికి ఆ డబ్బు సరిపోతుంది. కానీ రిజిస్ట్రేషన్ కి, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ వంటివి ఉంటాయి. వీటికి తక్కువ ఖర్చు ఏమీ అవ్వదు. ఇల్లు కొనాలి అన్న ఆలోచన ఉన్నప్పుడే ఈ రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ ఛార్జీలు, జీఎస్టీకి ఎంత అవుతుంది, ఇతర ఖర్చులు ఎంత అవుతాయి వంటి విషయాలు తెలుసుకోవాలి. బైక్ కొనడానికో, కారు కొనడానికో వెళ్తే ఎక్స్ షోరూం ధర చెప్తారు కానీ ఆన్ రోడ్ ధర లోపలకి వెళ్ళాక తెలుస్తుంది. ఎక్స్ షోరూం ధరకి, ఆన్ రోడ్ ధరకి చాలా తేడా ఉంటుంది. 10 వేలు, 20 వేలు తేడా కాబట్టి మ్యానేజ్ చేయచ్చు. మరీ 5 లక్షలు, 10 లక్షలు అంటే అప్పటికప్పుడు సర్దుబాటు అవ్వదు కదా. అందుకే ఇల్లు కొనేముందు కూడా అదనపు ఛార్జీల గురించి తెలుసుకోవాలి.
కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే స్టాంప్ డ్యూటీ ఛార్జీలు ఇంటి విలువలో 5 నుంచి 7 శాతం వరకూ ఉంటాయి. రిజిస్ట్రేషన్ ఫీజు 1 నుంచి 2 శాతం ఉంటుంది. ఈ రెండు దశలు పూర్తయితేనే ఇల్లు మీ పేరు మీద రిజిస్టర్ అవుతుంది. ఉదాహరణకు మీరు రూ. 50 లక్షల ఇంటిని కొన్నట్లైతే కనుక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజు కింద రూ. 3 లక్షలు ఖర్చు అవుతుంది. స్టాంప్ డ్యూటీకి రూ. 2,50,000 నుంచి రూ. 3,50,000 ఖర్చవుతుంది. రిజిస్ట్రేషన్ కి రూ. 50 వేల నుంచి రూ. లక్ష అవుతుంది. మొత్తం మీద ఇల్లు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవ్వాలంటే రూ. 3 లక్షల నుంచి రూ. 4,50,000 దాకా అవుతుంది.
నిర్మాణం పూర్తైన ఇంటిని కొనుగోలు చేసినట్లయితే పూర్తయినట్టు సర్టిఫికెట్ ఉంటే కనుక జీఎస్టీ ఉండదు. రీసేల్ ఇండ్లకు జీఎస్టీ వర్తించదు. అలా కాకుండా నిర్మాణంలో ఉన్న ఇల్లు కొనుగోలు చేస్తే కనుక ఇంటి విలువలో 5 శాతం జీఎస్టీ వర్తిస్తుంది. ఉదాహరణకు రూ. 50 లక్షల ఇంటిని కొనుగోలు చేస్తే రూ. 2,50,000 జీఎస్టీ పడుతుంది.
ఫ్లాట్ కొనే సమయంలో పార్కింగ్ చాలా ముఖ్యం. వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి స్థలంతో పాటు అమ్ముతున్నారా? లేక స్థలం లేకుండా అమ్ముతున్నారా? అనేది చూసుకోవాలి. కొంతమంది బిల్డర్లు స్థలం కోసం ప్రత్యేకంగా ఛార్జీలు వసూలు చేస్తారు. సాధారణంగా చాలా మంది అనుకునేది ఏంటంటే.. స్థలం కొంటే పార్కింగ్ స్థలం కూడా వస్తుంది కదా అని. కానీ కొన్ని సందర్భాల్లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఛార్జీలు విధిస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు ఉన్నా, ప్రత్యేక పార్కింగ్ స్థలం కావాలన్నా ఎక్కువ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది.
గేటెడ్ కమ్యూనిటీలో గానీ, సొసైటీలో గానీ ఫ్లాట్ కొంటే అయిపోదు. మళ్ళీ ఇక్కడ అపార్ట్మెంట్ నిర్వహణ కోసం, పార్కులు, లైటింగ్, లిఫ్ట్, సెక్యూరిటీ వంటి వాటికి అదనంగా ఛార్జీలు విధిస్తారు. ఇవి తక్కువే ఉంటాయి కానీ నెల నెలా ఉంటాయి.
కొత్త ఇల్లు కొన్నప్పుడు ఇంటీరియర్ డెకరేషన్, కొత్త ఫర్నిచర్, పెయింటింగ్, ప్లంబింగ్ వంటి వాటికి అదనపు ఖర్చులు పెట్టుకోవాల్సి వస్తుంది. ఒకవేళ బ్యాంకులో రుణం తీసుకుని ఇల్లు కొంటే కొనాలనుకుంటే కనుక లీగల్ వెరిఫికేషన్ ఛార్జీలు, మార్టగేజ్ రిజిస్ట్రేషన్, లోన్ ప్రాసెసింగ్ ఛార్జీలు ఉంటాయి.
కరెంట్ బిల్ ఎలాగూ తప్పదు. మౌలిక సదుపాయాలు, మంచి నీరు, మురుగు నీటి నిర్వహణకు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం మీద కొత్త ఇల్లు కొనే సమయంలో అనుకున్న బడ్జెట్ కంటే అదనంగా పైన చెప్పబడిన ఛార్జీలు అదనంగా మీ మీద పడతాయి. ఉదాహరణకు రూ. 50 లక్షల బడ్జెట్ తో కొత్త ఇల్లు కొనుగోలు చేస్తే కనుక స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, జీఎస్టీ, ఇతర ఛార్జీలు కలిపి రూ. 7 లక్షల నుంచి రూ. 10 లక్షల మధ్యలో ఖర్చు అవుతుంది. అంటే ఇల్లు బడ్జెట్ కాకుండా అదనంగా ఓ రూ. 10 లక్షలు సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది.