‘రీఛార్జ్ చేయండి.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు ఉచితంగా పొందండి..’ ఈ ప్రకటనలతో యూజర్లకు ఆకర్షించిన టెలికాం కంపెనీలు ఇప్పుడు ఆ సేవలను మాయం చేస్తున్నాయి. తాజాగా, దేశంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న రిలయన్స్ జియో సైతం ఇదే చేసింది. డిస్నీ+హాట్ స్టార్ ప్లాన్లతో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్లను పూర్తిగా తొలగించింది. అక్టోబర్ లో కొన్ని ప్లాన్లకే తొలగించిన జియో, ఇప్పుడు ఏకంగా అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లకు అదే చేసింది. దీంతో ఓటీటీ సేవలు కావాలనుకుంటే యూజర్లు, సెపరేట్ గా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలి.
కరోనా మహమ్మారి రాక ఓటీటీ రంగాన్ని మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా చేసింది. సినిమాలు, వెబ్ సిరీసులు, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా ఓటీటీ యాపులు బోలెడంత వినోదాన్ని పంచుతున్నాయి. దీంతో యూజర్లు రీఛార్జ్ చేసేటపుడు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా ఉంటున్న ప్లాన్లనే ఎంచుకునేవారు. దీంతో అదనపు భారం తగ్గేది. అయితే ప్రస్తుతానికి రిలయన్స్ జియో వెబ్ సైట్/ యాప్ లో గానీ, పేటీఎం, అమెజాన్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాపుల్లో కానీ ఈ ప్లాన్లు కనిపించడం లేదు. ఇప్పటికే ఈ ప్లాన్లు యాక్టివేట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ సర్వీసులు కొనసాగుతాయి. కొత్తగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలనుకునే వారికి ఈ ప్లాన్లు ఇక అందుబాటులో ఉండవు.
అయితే.. జియో, డిస్నీ+హాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ తొలగించడం వెనుక కొన్ని కారణాలున్నాయంటున్నాయి మార్కెట్ వర్గాలు. ఇన్నాళ్లు ఐపీఎల్ ప్రసార హక్కులను దక్కించుకుంటూ వచ్చిన డిస్నీ+హాట్ స్టార్.. ఐపీఎల్ 2023 ఎడిషన్ ప్రసార హక్కులను కోల్పోయింది. ఈసారి రిలయన్స్ గ్రూప్ కు చెందిన వయాకామ్ 18 ఆ హక్కులను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే హాట్ స్టార్ ప్లాన్లను జియో తొలగించినట్లు తెలుస్తోంది. డిస్నీ+హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన బండిల్ ప్రీపెయిడ్ ప్లాన్లను ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా మాత్రం కొనసాగిస్తున్నాయి.
Jio discontinues Disney+ Hotstar recharge plans ahead of #T20WorldCup. pic.twitter.com/SpdtORXcQS
— mysmartprice (@mysmartprice) October 12, 2022