సొంత ఇల్లు కోసం హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలిస్తే హోమ్ లోన్ తీసుకోవాలని అస్సలు అనుకోరు. హోమ్ లోన్ తీసుకుని ఇల్లు కొనడం వల్ల ఎంత నష్టమో చూడండి.
సొంతంగా ఒక ఇల్లు కొనుక్కోవాలని చాలా మందికి ఉంటుంది. అయితే అందరి దగ్గర ఇల్లు కొనుక్కోవడానికి సరిపడా డబ్బులు ఉండవు. కాబట్టి వచ్చే జీతం చూపించి బ్యాంకుల్లో హోమ్ లోన్ తీసుకుంటారు. అయితే మీకు తెలుసా? హోమ్ లోన్ తీసుకోవడం వల్ల చాలా డబ్బు నష్టపోతారని. బ్యాంకుల్లో గానీ ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో గానీ హోమ్ లోన్ తీసుకోవడం వల్ల చాలా ఆర్థిక నష్టం జరుగుతుంది. ఈ విషయం తెలిస్తే మీరు అసలు హోమ్ లోన్ జోలికే వెళ్ళరు. అదేంటి తక్కువ వడ్డీకే బ్యాంకులు హోమ్ లోన్ ఇస్తున్నాయి కదా.. మరి ఇక్కడ నష్టం ఎక్కడ జరిగింది అని మీకు అనిపించవచ్చు. ప్రస్తుతం బ్యాంకులు 8.5 శాతం నుంచి 10.25 శాతం వడ్డీతో హోమ్ లోన్స్ ఇస్తున్నాయి.
ఉదాహరణకు మీరు ఇల్లు కొనడం కోసం లేదా కట్టడం కోసం రూ. 50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. వడ్డీ రేటు 9.5 శాతం అనుకుంటే, లోన్ టెన్యూర్ 40 ఏళ్లకు పెట్టుకుంటే నెలకు రూ. 40,500 ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. ఈ లెక్కన మీరు 40 ఏళ్లలో బ్యాంకుకి కట్టేది ఎంతో తెలుసా? కోటి 94 లక్షల 40 వేల రూపాయలు. ఇంటి కోసం మీరు తీసుకున్న లోన్ రూ. 50 లక్షలు అయితే దగ్గర దగ్గర రూ. 2 కోట్లు కడుతున్నారు. అంటే అదనంగా కోటి 44 లక్షల 40 వేల రూపాయలు కడుతున్నట్టు. సుమారు మూడు రెట్లు అదనంగా కడుతున్నట్టు. అదే 35 ఏళ్ల టెన్యూర్ అయితే కనుక నెలకు రూ. 41 వేలు చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. 35 ఏళ్లలో బ్యాంకుకి మీరు కట్టే అమౌంట్ ఎంతో తెలుసా? కోటి 72 లక్షల 20 వేల రూపాయలు. అంటే అదనంగా రూ. 1.22 కోట్లు వడ్డీ చెల్లిస్తున్నట్లు.
30 ఏళ్ల టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 42 వేల ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. ఈ లెక్కన బ్యాంకు వారికి అసలు, వడ్డీ కలిపి మీరు కట్టేది కోటి 51 లక్షల 20 వేల రూపాయలు. అదనంగా వడ్డీ రూపంలో రూ. కోటి పైనే కడుతున్నట్టు. 25 ఏళ్ల టెన్యూర్ అయితే నెలకు రూ. 44 వేలు ఈఎంఐ పడుతుంది. ఈ 25 ఏళ్లలో బ్యాంకుకి అసలు, వడ్డీ కలిపి రూ. కోటి 32 లక్షలు చెల్లించాలి. అదనంగా రూ. 82 లక్షలు కడుతున్నట్టు. 20 ఏళ్ల టెన్యూర్ ఎంచుకుంటే నెలకు రూ. 47 వేలు ఈఎంఐ చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు మీరు బ్యాంకుకి చెల్లిస్తున్న మొత్తం కోటి 12 లక్షల 80 వేల రూపాయలు. అదనంగా రూ. 62,80,000 చెల్లిస్తున్నట్టు.
అదే 15 ఏళ్లకు టెన్యూర్ పెట్టుకుంటే నెలకు రూ. 52 వేలు ఈఎంఐ పడుతుంది. ఈ లెక్కన బ్యాంకుకి చెల్లించేది రూ. 93,60,000. అంటే అదనంగా రూ. 43,60,000 చెల్లిస్తున్నట్టు. పదేళ్ల టెన్యూర్ తో హోమ్ లోన్ పెట్టుకుంటే కనుక రూ. 65 వేలు అవుతుంది ఈఎంఐ. అప్పుడు అసలు, వడ్డీ రూ. 78 లక్షలు అవుతుంది. అదనంగా వడ్డీ రూ. 28 లక్షలు అవుతుంది. బ్యాంకులకు చెల్లించే ఈ వడ్డీ డబ్బులతో ఇంకో 2, 3 ఇళ్ళను కొనుగోలు చేయవచ్చేమో అనిపిస్తుంది. హోమ్ లోన్ తీసుకుంటే ఇంత వడ్డీ అవుతుందా అని భయపడేవారు ఖచ్చితంగా ఈ హోమ్ లోన్ జోలికి పోరు. చాలా మంది ఈ లెక్కలు వేసుకునే హోమ్ లోన్ అంటే భయపడిపోతున్నారు.