దేశంలోని బ్యాంకుల్లో ఉత్తమ సేవలు అందించే వాటిల్లో ఎస్బీఐ ఒకటి. ప్రైవేటు బ్యాంకులకు దీటుగా ఎస్బీఐ సర్వీసులు అందిస్తోంది. తాజాగా తన కస్టమర్లకు శుభవార్త అందించిందీ దిగ్గజ బ్యాంకు.
టాటా ఏస్ ఎంత ఫేమస్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గ్రామాలు, పట్టణాల్లో ఈ బండ్లు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. పాల సరఫరా, కూరగాయల సరఫరాతో పాటు పలు వ్యాపారాలకు దీన్ని బాగా వాడుతుంటారు. టాటా మోటార్స్ ఎక్కువగా అమ్మిన వాహనాల్లో టాటా ఏస్ కూడా ఒకటి. అలాంటి టాటా ఏస్ ఇప్పుడు ఈవీ మోడల్లో కూడా లభ్యమవుతోంది. ఈ టాటా ఏస్‌ను కొనాలనుకునే వారికి దేశీ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. టాటా ఏస్ ఈవీ వెహికిల్ కొనుగోలుకు సులభంగా రుణాలు ఇస్తామని ఎస్బీఐ ప్రకటించింది. ఈ వాహనాన్ని కొనాలనుకునే తమ కస్టమర్లకు తేలిగ్గా లోన్స్ అందిస్తామని వెల్లడించింది.
టాటా మోటార్స్‌తో తాజాగా ఎస్బీఐ ఈ మేరకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే కొన్ని కండీషన్స్ ఉన్నాయి. తీసుకున్న రుణాన్ని మాత్రం ఆరేళ్లలోపే చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంక్ దాదాపుగా 90 శాతం ఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అంటే సుమారుగా రూ.8.99 లక్షల వరకు లోన్ పొందొచ్చు. చేతిలో రూ.లక్ష ఉంటే లోన్ తీసుకుని టాటా ఏస్ ఈవీని ఇంటికి తెచ్చుకోవచ్చు. మిగతా మొత్తాన్ని నెలవారీగా ఈఎంఐల రూపంలో చెల్లించాలి. ఇక, టాటా ఏస్‌లో ఉన్న ఫీచర్ల విషయానికొస్తే.. ఒక్కసారి ఫుల్‌గా ఛార్జ్ చేస్తే.. ఏకంగా 154 కిలోమీటర్లు పరిగెడుతుంది. దీంట్లో ఉన్న 27 కేడబ్ల్యూ మోటార్ పవర్ 36 హెచ్‌పీ సామర్థ్యం కలిగి ఉంటుంది. సిటీలో సరుకు రవాణా కోసం ఈ వెహికిల్స్‌ను వినియోగించొచ్చు.