గౌతమ్ అదానీ.. ఓ ఏడాది క్రితం వరకు కూడా ఈ పేరు గురించి కేవలం వ్యాపార వర్గాల్లో వారికి మాత్రమే బాగా తెలుసు. కానీ నేడు సామాన్యులు కూడా అతడి గురించి చర్చించుకుంటున్నారు. అవును మరి ఏడాది కాలంలో ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలోకి ఎగబాకాడు. అప్పటి వరకు ప్రపంచ కుబేరుల్లో భారతదేశం నుంచి తొలి స్థానంలో నిలిచిన వ్యక్తి ముఖేష్ అంబానీ. కానీ అతి తక్కువ కాలంలోనే అనూహ్యంగా అదానీ సంపద భారీగా పెరిగి.. ముఖేష్‌ను కూడా దాటేసి.. ఏకంగా ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో గౌతమ్ అదానీ సంపద, వ్యక్తిగత వివరాల వంటి వాటి గురించి తెలుసుకునేందుకు ప్రజలు తెగ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా గౌతమ్ అదానీ కొన్న కొత్త కారు గురించి మార్కెట్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అన్ని కోట్లు ఖరీదు చేసే కారు కొన్నారంటూ ఆశ్చర్యపోతున్నారు. ఈ కారు ధర, ఫీచర్లు.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆ వివరాలు..
గౌతమ్ అదానీ లగ్జరీ కారు రేంజ్ రేవర్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక దీని ధర అక్షరాలా రూ. 4 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. దీనికి సంబంధించి ఫోటోలను hottestcarsin.india అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం అవి తెగ వైరలవుతున్నాయి. భారతదేశంలోనే అత్యంత ధనవంతుడు ఈ కారును కొన్నాడు అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేశారు. వైట్ కలర్ రేంజ్ రోవర్ కారు అందరిని ఆకర్షిస్తోంది. ఇక ఈ కారు ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న రేంజ్ రోవర్ మిడ్ స్పేక్ వేరియంట్లలో ఒకటైన ఆటోబయోగ్రఫీ 3.0 డీజిల్ లాంగ్ వీల్ బేస్ అని సమాచారం. పైగా ఇది 7 సీటర్ వెర్షన్ అంటున్నారు. డ్యూయెల్ టోన్ ఇంటిరీయర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ కారు 346 బీహెచ్‌పీ, 700 ఎన్‌ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ 3.0 డీజిల్ 3.0-లీటర్ ఇన్‌లైన్-సిక్స్ డీజిల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది గరిష్టంగా 346 బిహెచ్‌పి పవర్ అవుట్‌పుట్ మరియు 700 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇతర వేరియంట్‌ల మాదిరిగానే, రేంజ్ రోవర్‌లోని ఈ ప్రత్యేక వేరియంట్‌లో 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్, ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్‌ను స్టాండర్డ్‌గా అమర్చారు. ఇక ఈ కారు కేవలం 7.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వరకు వేగాన్ని పొందుతుంది.
ఇక కారు లోపలి భాగాన్ని పరిశీలిస్తే.. ముందుగా చెప్పుకున్న విధంగా ఇది ఇంటీరియర్ డ్యూయెల్ టోన్ నలుపు, గోధుమ రంగులో ఉంది. అలానే దీని లోపల 13.7 ఇంచెట్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 13.1 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ వంటివి ఉన్నాయి. ఇక వెనక కూర్చునే వారి కోసం 11.4 ఇంచుల డిస్ప్లే ఉన్నాయి. ఇవి ప్రయాణంలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఉపయోగపడుతుంది. ఇక గౌతమ్ అదానీ దగ్గర ఇప్పటికే రోల్స్ రాయిస్ ఘొస్ట్, ఫెరారీ కాలిఫోర్నియా, బీఎండబ్ల్యూ 7 సిరీస్, ఆడి క్యూ7 వంటి కార్లు ఉండగా.. తాజాగా వీటి సరసన రేంజ్ రోవర్ కూడా చేరింది. ఇక ఇవే కాక అదానీ దగ్గర ఎంబ్రేయర్ లెగసీ 650, బొంబార్డియర్ ఛాలెంజర్ 605, బీచ్‌క్రాఫ్ట్ 850 ఎక్స్‌పీ వంటి హెలీకాప్టర్లు కూడా ఉన్నాయి.