ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని నెలలుగా స్వల్పంగా తగ్గినట్టు తగ్గి భారీగా పెరిగిపోతున్నాయి. అయితే గడిచిన ఆరేళ్లుగా చూసుకుంటే బంగారం డిమాండ్ అనేది తగ్గిందని నివేదికలు చెబుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బంగారం ధరలు తగ్గుతాయా?
భారత్ లో బంగారం డిమాండ్ పడిపోయిందని, ఆరేళ్ళ కనిష్టానికి చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తెలిపింది. 2023 జనవరి నుంచి మార్చి నెలల్లో బంగారం డిమాండ్ 17 శాతం తగ్గిందని గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ రిపోర్ట్ లో వెల్లడించింది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ డేటా ప్రకారం.. 2023 మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 112.5 టన్నుల వద్ద నిలిచింది. గత ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ డిమాండ్ విలువ 135.5 టన్నులు ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో 17 శాతానికి డిమాండ్ తగ్గింది. విలువ పరంగా చూస్తే.. 2023 మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ 9 శాతం తగ్గి రూ. 56,220 కోట్లకు పడిపోయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో బంగారం డిమాండ్ విలువ రూ. 61,540 కోట్లుగా ఉంది.
అంతర్జాతీయ పరిణామాలు, యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు, డాలర్ రేటు పెరగడం, రూపాయి పతనం కావడం వంటివి బంగారం ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇది బంగారం సెంటిమెంట్ మీద, బంగారు ఆభరణాల డిమాండ్ మీద ప్రభావం చూపించింది. దీంతో గత ఏడాది మొదటి త్రైమాసికంలో 94.2 టన్నులు ఉన్న బంగారం డిమాండ్ ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 78 టన్నులకు పడిపోయింది. విలువ ప్రకారం.. బంగారం డిమాండ్ రూ. 39,000 కోట్లు తగ్గింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో డిమాండ్ విలువ రూ. 42,800 కోట్లు ఉండేది. ఇప్పుడు అది 19 శాతం తగ్గింది. ఇక పెట్టుబడి డిమాండ్ 2022 మొదటి త్రైమాసికంలో 41.3 టన్నులు ఉండగా 2023 మొదటి త్రైమాసికంలో 17 శాతం తగ్గి 34.4 టన్నులకు పడిపోయింది.
విలువ ప్రకారం.. బంగారం పెట్టుబడి డిమాండ్ మొదటి త్రైమాసికంలో రూ. 17,200 కోట్లకు పడిపోయింది. గత ఏడాది మొదటి త్రైమాసికంలో పెట్టుబడి డిమాండ్ రూ. 18,750 కోట్లు ఉండేది. ఇప్పుడు 8 శాతం తగ్గింది. 2016లో బంగారం డిమాండ్ 107 టన్నులు ఉండేది. ఐతే లాక్ డౌన్ కారణంగా 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆ డిమాండ్ 44 టన్నులకు పడిపోయింది. లాక్ డౌన్ సమయం మినహాయిస్తే 2010 నుంచి ఇప్పటి వరకూ మొదటి త్రైమాసికంలో బంగారం డిమాండ్ తగ్గడం ఇది నాల్గవ సారి. డిమాండ్ తగ్గడానికి గృహిణులు ధర తగ్గిన తర్వాత కొనవచ్చు అని అనుకోవడం ఒక కారణం. మరో కారణం, గోల్డ్ బార్స్, గోల్డ్ కాయిన్స్ వంటి వాటిలో పెట్టుబడి డిమాండ్ పెరగడం.
ఈ కారణాల వల్ల 17 శాతం డిమాండ్ తగ్గింది. బంగారం ధరలు పెరగడం వల్ల కొనేవారి సంఖ్య తగ్గింది. దీంతో బంగారం ఏ సమయంలో అయినా మళ్ళీ తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఏ వస్తువుకైనా డిమాండ్ లేకపోతే ధరలు దిగి రావడం అన్నది సహజం. ధరలు తక్కువగా ఉంటే మళ్ళీ జనాలు ఎగబడి కొనే అవకాశం ఉంటుంది. అప్పుడు మళ్ళీ బంగారం డిమాండ్ అనేది పెరుగుతుంది. అయితే ఈ మార్పులు రావడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేము గానీ బంగారం ధరలు తగ్గే అవకాశాలు అయితే ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.