ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలని అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా కార్ల ప్రారంభ ధర కూడా చాలా తక్కువే అని చెబుతున్నారు.
ఎలాన్ మస్క్ ఆలోచనలు నుంచి వచ్చిన టెస్లా ఎలక్ట్రిక్ కార్లపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. డ్రైవర్ లేకుండా నడిచే ఆటోపైలట్ కార్లు ఇండియాలో ఎప్పుడు అడుగుపెడతాయా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో టెస్లా కంపెనీ భారత మార్కెట్లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. భారత్ లో కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అందుకోసం ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్ ను ఉంచిన టెస్లా కంపెనీ భారత అధికారులతో సంప్రదింపులు చేపడుతోంది. దేశంలో ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలన్న లక్ష్యంతో టెస్లా కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ నాయకత్వంతో భారత్ లో టెస్లా కంపెనీ తయారీ ఫ్యాక్టరీ అంశమై చర్చలు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో టెస్లా కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టెస్లా కంపెనీ చైనా దేశంలో తన సత్తా చాటుతోంది. ఆ దేశంలో చాలా కంపెనీలు ఉన్నాయి. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలోకి టెస్లా కార్లను పెద్ద ఎత్తున రవాణా చేసేందుకు భారత్ లో తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసి భారత్ ను ఒక ఎగుమతి స్థావరంగా మలుచుకునేందుకు టెస్లా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. టెస్లా కంపెనీ గొప్ప ఐడియాతో ముందుకొచ్చిందని.. ఈసారి అన్నీ సానుకూలంగానే ఉంటాయని భావిస్తున్నామని, ఇది స్థానిక తయారీ పరిశ్రమని సపోర్ట్ చేయడమే కాకుండా ఎగుమతుల పరంగా కూడా మంచి నిర్ణయమని అధికారులు అన్నట్లు సమాచారం.
గత నెలలో అమెరికా పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ అక్కడ పారిశ్రామికవేత్తలను కలిశారు. వారిలో ఎలాన్ మస్క్ కూడా ఉన్నారు. ఎలాన్ మస్క్, ప్రధాని మోదీ మధ్య చర్చలు సానుకూలంగా సాగిన విషయం తెలిసిందే. భారత్ లో టెస్లా పెట్టుబడులు పెట్టాలని తాను కోరుకుంటున్నానని ప్రధాని అన్నారు. భారత్ కూడా సానుకూలంగానే ఉందని సంకేతాలు ఇచ్చారు. ఈ క్రమంలో చర్చలు జరుగుతున్నాయి. ఇక భారత్ లో టెస్లా కార్లు ప్రారంభ ధర 20 లక్షలు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం భారత్ లో ఎక్కువగా అమ్ముడుపోతున్న టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ షోరూం ధర రూ. 17.50 లక్షలు ఉంది. ఈ ఫుల్లీ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ వెర్షన్ ఆటోపైలట్ ఫీచర్ తో రూ. 20 లక్షల ధరతో భారత్ లో లాంఛ్ అయితే కనుక టాటా సహా ఇతర ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీలకు గట్టి పోటీ ఇస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి టెస్లా కార్లు భారత్ లో అడుగుపెట్టనుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.