బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? అయితే అక్షయ తృతీయ రోజు నుంచి మీ పెట్టుబడులను ప్రారంభించండి. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకొని మీ పెట్టుబడులు ప్రారంభించండి.
మనదేశంలో బంగారం అంటే కేవలం అలంకరణ వస్తువు మాత్రమే కాదు.. మన సంస్కృతి-సంప్రదాయాలతో పెనవేసుకుపోయిన ఒక బంధం. అందుకే, బంగారంపై అందరికీ మక్కువ. ఇసుమంతయినా పసిడి లేకుండా ఏ ఇంట్లోనూ శుభకార్యం జరగదు. ప్రతి ఒక్కరూ తమ స్తోమతకు తగ్గట్టుగా ఎంతోకొంత బంగారం ఖచ్చితంగా కొనుక్కుంటారు. అందులోనూ ఇటీవలకాలంలో పసిడి అంటే ఒక పెట్టుబడి సాధనంగా మారిపోయింది. అయితే బంగారంపై పెట్టుబడి అనగానే చాలామంది నగలు, బంగారపు బిస్కట్లు, కడ్డీల రూపంలో బంగారాన్ని కొన్ని దాచుకుంటారు. అది మాత్రమే కాదు.. బోలెడు మార్గాలున్నాయి. అవేంటో తెలుసుకొని మీ పెట్టుబడులు పెట్టేయండి..
బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్నవారు అక్షయ తృతీయ నాటి ప్రారంభించడం శుభసూచకం అని చెప్పొచ్చు. ఎందుకంటే.. అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులు కొంటే శుభం చేకూరుతుందని హిందువుల విశ్వాసం. ముఖ్యంగా బంగారం కొంటే సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది, చిరకాలం ఉండేది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ నాడు ఏవైనా వస్తువులు కొన్నా, ఏదేని కొత్త వ్యాపారులు మొదలుపెట్టినా ఎప్పటికీ ఉండిపోతాయని నమ్ముతారు. ఈ ఏడాది అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. కావున ఆరోజు నుంచి మీ పెట్టుబడులను ప్రారంభించవచ్చు.
‘సావరిన్ గోల్డ్ బాండ్ స్కీం’ పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఇది చాలా సురక్షితమైన ఆప్షన్. కేంద్ర ప్రభుత్వం తరఫున ఆర్బీఐ వీటిని జారీ చేస్తుంది. కనిష్టంగా ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కిలోల వరకు కొనుగోలు చేయొచ్చు. బాండ్ల జారీని ప్రకటించడానికి ముందున్న మూడు రోజుల సగటు బంగారం ధరను లెక్కించి, ఆ మొత్తాన్ని సావరిన్ గోల్డ్ బాండ్‌లో ఒక గ్రాము బంగారం ధరగా నిర్ణయిస్తారు. వీటి మెచ్యూరిటీ గడువు.. 8 సంవత్సరాలు. 5 సంవత్సరాల తర్వాత విత్‌డ్రా చేసుకోవచ్చు. అప్పటి ధర ప్రకారం డబ్బు చెల్లిస్తారు. ఈ బాండ్లను ఏదేని బ్యాంకుల్లో తనఖా పెట్టి లోన్ కూడా తీసుకోవచ్చు. దీనిపై వార్షిక వడ్డీ 2.50 శాతంగా ఉంది.
బంగారాన్ని నేరుగా కొనుగోలు చేసే బదులుగా డిజిటల్ రూపంలో కొనుగోలు చేయడాన్నే ‘డిజిటల్ గోల్డ్’ అంటారు. దీన్ని ఆన్‌లైన్‌లో మధ్యవర్తి సంస్థ ద్వారా కొనుగోలు చేయాలి. మీరు చెల్లించే డబ్బుకు సమానమైన బంగారాన్ని మధ్యవర్తి సంస్థ కొని, మీ పేరుపై ఉంచుతుంది. కనిష్టంగా ఒక గ్రాము కూడా కొనుగోలు చేయొచ్చు. స్టాక్ బ్రోకింగ్ కంపెనీలతో పాటు పేటీఎం, ఫోన్‌పే వంటి ఆర్థిక సేవల సంస్థల ద్వారా కూడా డిజిటల్ బంగారాన్ని కొనవచ్చు. అవసరమైనప్పుడు విక్రయించడం ద్వారా అప్పటి మార్కెట్ రేటును బట్టి మీరు డబ్బులు పొందవచ్చు.
వీటిని గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు లేదా గోల్డ్ ఈటీఎఫ్‌లుగా పిలుస్తారు. ఇది కూడా ఎలక్ట్రానిక్ రూపంలోని బంగారమే. ఎలక్ట్రానిక్ రూపంలో సులభంగా వీటిని కొనవచ్చు, అమ్మవచ్చు. స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా వీటి క్రయవిక్రయాలు చేపట్టవచ్చు. ఎలక్ట్రానికే రూపం కనుక.. భద్రపరచాలన్న బెంగ ఉండదు. దొంగతనం జరిగే ప్రమాధాలు ఉండవు.
బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ తరహాలోనే మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇన్వెస్ట్ చేయవచ్చు. అందుకోసం వివిధ మ్యూచువల్ ఫండ్ హౌస్‌ల పథకాలు అందుబాటులో ఉన్నాయి. మీరు జమ చేసే డబ్బును గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ పేరుతో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు.. ఈటీఎఫ్‌లలో పెట్టుబడి పెడుతుంటాయి. ఇందుకు డీమ్యాట్ ఖాతా తప్పనిసరి కాదు.
ఈ ఆప్షన్ అందరికీ విదితమే. బంగారాన్ని నాణేలు, కడ్డీలు, బిస్కెట్ల రూపంలో కొని దాస్తుంటారు. ధర పెరిగినప్పుడు వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటుంటారు. బంగారు నాణేలను, బిస్కెట్లను.. బ్యాంకులు లేదా ఆథరైజ్డ్ నగల డీలర్ వద్ద నుంచి కొనుగోలు చేయవచ్చు.
Disclaimer: ఈ సమాచారం కేవలం అవగాహన కొరకు మాత్రమే. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. గమనించగలరు.