ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్, స్టీలు, ఇసుక, ఇటుకలు, ప్లాస్టరింగ్, సీలింగ్, స్లాబ్, కార్పెంటరీ వర్క్ ఇలా చాలా ఉంటాయి. మరి ఇల్లు పూర్తవ్వడానికి కావాల్సిన మెటీరియల్ కి, కాంట్రాక్టర్ కి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా?
సొంతింటి కల అనేది ఎంతోమందికి ఉంటుంది. కొంతమంది కట్టేసిన ఇళ్ళు కొంటారు. లేదా ఫ్లాట్లు కొంటారు. కొంతమంది స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటారు. ఈరోజుల్లో ఫ్లాట్ కొనాలంటే ఏరియాను బట్టి రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలు అవుతుంది. కానీ స్థలం మాత్రం అపార్ట్మెంట్ లో ఉన్న అందరికీ చెందుతుంది. దీని వల్ల భవిష్యత్తులో నష్టమే. ఏదోలా కష్టపడి స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకుంటే దీన్ని మించిన మంచి పని మరొకటి ఉండదు. ఇల్లు పాతబడిపోతుంది కానీ స్థలం పాతబడదు. పైగా దాని రేటు అనేది పెరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని భావిస్తారు. మీరు కనుక స్థలం కొని ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారా? లేదా ఆల్రెడీ స్థలం ఉండి ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇల్లు కట్టుకోవాలంటే హైదరాబాద్ లో ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందామా?
హైదరాబాద్ నగరంలో 3 సెంట్ల స్థలంలో అంటే 144 గజాల ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే గనుక మూడు గ్రేడ్ లు ఉన్నాయి. బేసిక్, మీడియం, ప్రీమియం గ్రేడుల్లో ఇల్లు కట్టుకోవచ్చు. బేసిక్ గ్రేడ్ అయితే 15 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. మీడియం గ్రేడ్ అయితే రూ. 19 లక్షల్లో అయిపోతుంది. ప్రీమియం గ్రేడ్ లో కట్టుకోవాలనుకుంటే రూ. 23 లక్షలు అవుతుంది. చదరపు అడుగుకు రూ. 1171, రూ. 1433, రూ. 1802 చొప్పున ఖర్చు అవుతుంది.
బేసిక్ అంటే తక్కువ క్వాలిటీ సిమెంట్, తక్కువ నాణ్యత ఉంటుంది. శానిటరీ, ఎలక్ట్రికల్, పెయింటింగ్ వంటి విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుంది. కిచెన్ ప్లాట్ ఫారం, సింక్ మాత్రమే వస్తాయి. కనీస సదుపాయాలు ఉంటాయి. కానీ రిచ్ నెస్ అనేది ఉండదు. వెధవ రిచ్ నెస్ ఎందుకు మనకు, సింప్లిసిటీ చాలనుకుంటే రూ. 15 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. మీడియం గ్రేడ్ లో సిమెంట్ క్వాలిటీ ఉంటుంది. ఎలక్ట్రికల్, శానిటరీ, పెయింటింగ్, కాంట్రాక్టర్, ఆర్సీసీ, ఫ్లోరింగ్ వంటి వాటిలో నాణ్యత ఉంటుంది. కిచెన్ అయితే సెమీ మాడ్యులర్ లో వస్తుంది. దీనికి రూ. 18 లక్షల ఖర్చు అవుతుంది. ఇక ప్రీమియం గ్రేడ్ లో అంటే ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ వస్తుంది. పెయింటింగ్, ఎలక్ట్రికల్, శానిటరీ వర్క్ లో నాణ్యత ఉంటుంది. సిమెంట్, స్టీలు, ఇసుక, ఫ్లోరింగ్, కాంట్రాక్టర్ వర్క్ అన్నీ హై క్వాలిటీగా ఉంటాయి. దీని ఖర్చు రూ. 23 లక్షలు అవుతుంది. హైదరాబాద్ లో ఇల్లు కట్టుకోవాలంటే కనీసం రూ. 15 లక్షలు నుంచి రూ. 25 లక్షలు ఉండాలి. మిగతా ఏరియాల్లో కూడా ఇలానే ఉండచ్చు. ఇక ఖమ్మం, కరీంనగర్ వంటి జిల్లాల్లో రూ. 2 లక్షల నుంచి రూ. 3 లక్షల వ్యత్యాసం ఉండవచ్చు.
గమనిక: ఈ లెక్కలు కేవలం అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ఈ ధరల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని గమనించగలరు.