బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకుల్లో ఈ షో అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ సీజన్ మాత్రం అందుకు భిన్నంగా సాగిన విషయం తెలిసిందే. ఎంతో మంది అభిమానులు ఉన్న ఈ షో ఈసారి మాత్రం ఫెయిల్ అయ్యిందనేది ఓపెన్ సీక్రెట్. ఈసారి వచ్చిన కంటెస్టెంట్ల వల్లనో.. షో సాగిన తీరు వల్లనో, 24 గంటల లైవ్ అని చెప్పి రికార్డింగ్ టెలికాస్ట్ చేయడం వల్లనో.. కారణం ఏదైనా అనుకున్న స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. అలాగే ఈసారి షో మీద నెగిటివిటీ కూడా ఎక్కువై పోయింది. ఇప్పటికే షోని గాడిలో పెట్టేందుకు చాలానే ప్రయత్నాలు చేశారు. కొన్ని ఫలించినా.. కొన్ని మాత్రం గట్టిగానే బ్యాక్ ఫైర్ అయ్యాయి. ఇప్పుడు షోకి ఇంకో రెండు సీజన్లకు సరిపోను పాజిటివిటీని తెచ్చిపెట్టే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
అవును.. షో సాగినంత కాలం ఎలాగూ ఆదరణ దక్కలేదు. ఇంక షో ముంగిపు సమయానికి అయినా కాస్త మంచి టాక్ సొంతం చేసుకుందాని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టిన ఆదిరెడ్డిని షో విన్నర్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే అది అసలు సాధ్యం అవుతుందా? లేదా? అనేది పరిశీలిద్దాం. ప్రస్తుతం హౌస్‌లో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. వారిలో నలుగురు పురుషులు, ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు. ప్రతిసారి బిగ్ బాస్ సీజన్‌లో అబ్బాయిలనే విన్నర్లను చేస్తుంటారంటూ అపవాదు ఉండనే ఉంది. బిగ్ బాస్ నాన్ స్టాప్‌కి బిందు మాధవిని విన్నర్ చేసినప్పటికీ.. అది రెగ్యులర్ సీజన్ కాదుగా అని చెప్పే పరిస్థితి ఉంది.
ఒకవేళ ఈ సీజన్లో లేడీని విన్నర్ చేద్దామని భావించినా కూడా.. ఉన్న శ్రీసత్య, కీర్తీ భట్, ఇనయా సుల్తానాలో ఆ స్థాయి కంటెస్టెంట్లు ఉన్నట్లు అయితే కనిపించలేదు. ఒకవేళ వారిలో ఏ ఒక్కరిని విన్నర్‌ని చేసినా ప్రేక్షకులు కూడా హర్షించే పరిస్థితి లేదు. ఇనయాకి కాస్తో కూస్తో సపోర్ట్ ఉన్నప్పటికీ.. విన్నర్‌ని చేసే రేంజ్ ఆదరణ లేదు. ఇంక శ్రీసత్య, కీర్తీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఇంక మిగిలిన నలుగురు అబ్బాయిల్లో.. రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి ఉన్నారు. రేవంత్ లీడింగ్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ ఇంట్లోనే కాదు.. బయట కూడా అలాగే నెగిటివిటీ ఉంది. శ్రీహాన్‌కు కాస్త క్రేజ్ ఉన్నా కూడా.. నటన అంటూ చాలా మంది పెదవి విరుస్తున్నారు. ఇంక రోహిత్ విషయానికి వస్తే మంచి బిహేవియర్ అని పట్టా ఇస్తున్నప్పటికీ టైటిల్ గెలిచే అంత ఆదరణ లేదు.
అయితే బిగ్ బాస్ విషయంలో ఇప్పటికే కామన్ మ్యాన్ కేటగిరీ విషయంలో చాలా అపవాదులు ఉన్నాయి. కామన్ మ్యాన్‌గా పిలిచి రెండు మూడు వారాల్లో పంపేసి అవమానిస్తారంటూ కామెంట్లు ఉండనే ఉన్నాయి. గత రెండు సీజన్లు కూడా అసలు ఆ కేటగిరీలో ఎవరినీ తీసుకోలేదు. ఈసారి మళ్లీ ఆ కేటగిరీలో ఆదిరెడ్డిని తీసుకెళ్లారు. ఆదిరెడ్డి తన గేమ్ స్ట్రాటజీలు, తన మాట తీరు, అందరితో కలిసిపోతూ ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్నాడు. 13 వారాలు హౌస్‌లో కొనసాగిన ఆదిరెడ్డి టాప్-5 పక్కా అని అంతా అనుకుంటూనే ఉన్నారు. అయితే ఆదిరెడ్డిని విన్నర్‌గా చేసి ఇప్పటి వరకు ఉన్న నెగిటివిటీని పోగొట్టుకోవాలనే పథకం వేస్తున్నట్లు తెలుస్తోంది. మళ్లీ సెలబ్రిటీనే విన్నర్‌ని చేయడం కంటే ఫైటర్ అనే పేరు తెచ్చుకున్న ఆదిరెడ్డిని విన్నర్ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే నిజమైతే బిగ్ బాస్‌కు అటు సెలబ్రిటీలు, ఇటు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందనే చెప్పాలి. అయితే ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో తెలియాలంటే ఇంకో 10 రోజులు ఆగాల్సిందే.