ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిరు వ్యాపారులకు అండగా నిలుస్తున్న సంగతి తెలిసిందే. టైలర్లు, బార్బర్లు, ఆటోవాలాలకు మద్దతుగా ఉంటూ వచ్చిన ఏపీ సర్కారు.. ఇప్పుడు చిరు వ్యాపారుల కోసం జగనన్న తోడు పథకం కింద నిధులు విడుదల చేసింది. బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున వడ్డీలేని రుణం.. మొత్తం రూ.395 కోట్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. జగనన్న తోడు పథకం కింద 3.95 లక్షల మంది చిరు వ్యాపారులకు రూ.395 కోట్ల రుణాలు ఇచ్చినట్లు వివరించారు.
చిరు వ్యాపారులు బ్యాంకులకు చెల్లించిన వడ్డీని ప్రభుత్వం రీయంబర్స్ చేస్తుందని సీఎం జగన్ తెలిపారు. ఆ మొత్తాన్ని వారి ఖాతాల్లో నేరుగా జమ చేస్తుందన్నారు. ఇప్పటివరకు 15,31,347 మందికి రూ.2,406 కోట్ల వడ్డీలేని రుణాలు అందించామని చెప్పారు. గత ఆరు నెలల వ్యవధిలో ఈ పథకం కింద రూ.15.17 కోట్లను రీయంబర్స్‌మెంట్ చేశామని జగన్ పేర్కొన్నారు. ఈ పథకానికి సంబంధించి రుణాలను సకాలంలో చెల్లించిన 13.28 లక్షల మందికి రూ.63 కోట్లకు పైగా వడ్డీని తిరిగి చెల్లించామన్నారు.
చిరు వ్యాపారులు సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారని మెచ్చుకున్న సీఎం జగన్.. పాదయాత్ర సమయంలో వారి కష్టాలను దగ్గర నుంచి చూశానన్నారు. చిరు వ్యాపారులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వడ్డీ, గ్యారెంటీ లేకుండా రూ.10 వేల రుణం అందిస్తున్నామని జగన్ చెప్పారు. జగనన్న తోడు పథకం అందని చిరు వ్యాపారులు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం చిరు వ్యాపారుల జీవనోపాధికి దోహదపడుతుందని.. వ్యాపారుల పెట్టుబడికి కష్టం రాకూడదనే ఇలా రుణం అందజేస్తున్నామని జగన్ చెప్పుకొచ్చారు.