టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఆయన కుమారుడు చంద్రమౌళి కన్నుమూశారు. గుండె పోటు కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం తుది శ్వాస విడిచారు. వివరాల్లోకి వెళితే.. ధర్మారెడ్డి కుమారుడు చంద్రమౌళి ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు. మరో వైపు సివిల్స్‌కు కూడా ప్రిపేర్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రమౌళికి.. టీటీడీ చెన్నై స్థానిక సలహామండలి అధ్యక్షుడు ఏజే శేఖర్‌రెడ్డి కుమార్తెతో కొన్ని నెలల క్రితం వివాహం నిశ్చయమైంది.
వచ్చే నెలలో తిరుమలలో పెళ్లి చేయటానికి ముహూర్తం కుదిరింది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. చంద్రమౌళి పెళ్లి పత్రికలు పంచే పనిలో ఉన్నారు. ఆదివారం చెన్నై ఆళ్వారుపేటలోని బంధువుల ఇంటికి వెళ్లి పత్రిక ఇచ్చారు. కొంత సేపటి తర్వాత ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావటంతో కుప్పకూలారు. దీంతో ఆయన్ని నగరంలోని కావేరీ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ధర్మారెడ్డి ఆగమేఘాల మీద ఆసుపత్రికి వెళ్లారు. కుమారుడి పరిస్థితి చూసి తల్లడిల్లిపోయారు. చంద్రమౌళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు తీవ్రంగా శ్రమించారు. అయినప్పటికి ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. మూడు రోజుల నుంచి ప్రాణాలతో పోరాడుతున్న ఆయన ఆరోగ్యం బుధవారం ఉదయం మరింత క్షీణించింది.
చికిత్స పొందుతూనే తుది శ్వాస విడిచారు. దీంతో ధర్మారెడ్డి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వ్యక్తి ఇలా విగతజీవిగా మారటం పలువురిని కంటతడి పెట్టిస్తోంది. చంద్రమౌళి మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. ధర్మారెడ్డి కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. మరి, మరికొన్ని రోజుల్లో పెళ్లి ఉండగా అనారోగ్యంతో మరణించిన చంద్రమౌళి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ సంతాపాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.