ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే అంధబాలిక హత్య జరగడంతో.. పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను ఎస్పీ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట వ్యాప్తంగా సంచలనం సృష్టించింది తాడేపల్లి అంధబాలిక హత్య కేసు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నివాసానికి, పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడంతో.. పోలీసులు ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడిన నిందితుడు నగపోగు దయానందరాజు(30) అలియాస్ కుక్కల రాజును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలను జిల్లా ఇన్ ఛార్జి ఎస్పీ వకుల్ జిందాల్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడేపల్లి ఎన్టీఆర్ కట్ట సమీపంలో మనోహరమ్మ-యేసేబు దంపతులు నివాసం ఉండేవారు. వారికి ఎస్తేరు రాణి(17). రాణి ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే కంటిచూపును కోల్పోయింది. దాంతో ఆమెను ఇంటి వద్దే ఉంచి తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఆదివారం కూడ అలానే వెళ్లారు వారు. అయితే అదే ప్రాంతంలో నివసించే నగపోగు దయానందరాజు అలియాస్ కుక్కల రాజు(30) అదే రోజు గంజాయి తాగి రాణి ఇంట్లోకి చోరబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ విషయాన్ని తన తల్లికి చెప్పింది రాణి.
దాంతో రాజును నిలదీశారు రాణి తల్లిదండ్రులు.. దాంతో రాజు తప్పైందని ఒప్పుకోవడంతో అతడిని వదిలేశారు. అయితే రాణిపై కోపం పెంచుకున్న రాజు ఆదివారం రాత్రి వారింట్లోకి చొరబడి బాలికను కత్తితో నరికేశాడు. అనంతరం పారిపోయిన అతడిని తాజాగా అరెస్ట్ చేశారు పోలీసులు. బాలిక తల్లిదండ్రులు రాజును ప్రశ్నించడంతోనే కక్షపెంచుకున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసుల విచారణలో తేలింది. దాంతో రాజుపై రౌడీషీట్ ను ఓపెన్ చేస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. సీఎం జగన్, తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు దగ్గరలోనే ఈ ఘోరం చోటుచేసుకోవడం సంచలనం సృష్టించింది.