Narayana : పదో తరగతి పేపర్ లీక్ కేసులో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ అరెస్ట్ జరిగిందని టీడీపీ నిప్పులు చెరిగింది. అయితే, అరెస్టయిన కొన్ని గంటలకే చిత్తూరు కోర్టు ఆయనకు బేయిల్ ఇచ్చింది. చిత్తూరు పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చి, వ్యక్తిగత పూచికత్తు కింద వెనువెంటనే బేయిల్ ఇచ్చింది. మంగళవారం ఉదయం ఆయన అరెస్ట్ దగ్గరనుంచి కోర్టులో హాజరు పరచటం వరుకు అంతా సినీ ఫక్కీని తలిపించేలా జరిగింది.
హైదరాబాద్‌లో అరెస్ట్.. చిత్తూరుకు తరలింపు…
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు. పదో తరగతి ప్రశ్న పత్నం లీకేజీ కేసులో నారాయణ పాత్ర ఉందని తేలటంతో ఆయన్ని అరెస్ట్ చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు తెలిపారు. నారాయణ అరెస్ట్ విషయం తెలిసి టీడీపీ కార్యకర్తలు పోలీసు వాహనాన్ని అడ్డుకుంటారని భావించిన చిత్తూరు పోలీసులు పలుమార్లు వాహనాలను మార్చారు.
అలా వేరే దారులగుండా చిత్తూరుకు తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆయన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షల తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. అర్థరాత్రి 1.30నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు వాదనలు జరిగాయి. 2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు నారాయణ తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు. దీంతో వారి వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు. పోలీసుల అభియోగాల్ని తోసిపుచ్చారు. రూ. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తు కింద ఆయనకు జామీను ఇవ్వాలని, మే 18లోగా ఆ మొత్తం కట్టాలని అదేశించారు.
ఈ సందర్భంగా నారాయణ తరపు న్యాయవాది మాట్లాడుతూ.. ‘‘ నారాయణ విద్యాసంస్థల అధినేతగా నారాయణ ఉన్నారని ఆయనపై పోలీసులు అభియోగం మోపారు. కానీ, 2014లోనే నారాయణ విద్యాసంస్థల అధినేతగా వైదొలిగారు. విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా న్యాయమూర్తికి సమర్పించారు. నేరారోపణ నమ్మే విధంగా లేదని జడ్జి అభిప్రాయపడ్డారు. లక్ష పూచీకత్తు కింద బేయిల్ మంజూరు చేశారు. నారయణపై పోలీసులు అభియోగాలు నిరూపించలేదు’’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి : Narayana: నారాయణ దంపతుల అరెస్ట్‌పై ఏపీలో రాజకీయ రగడ..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.