వ్యక్తులను వ్యవస్థలుగా మార్చే శక్తి ఒక్క గురువుకే ఉంది. నేర్చుకునే శిష్యుడికి ఆసక్తి ఉండాలే గానీ ఎలాంటి వ్యక్తినైనా మార్చగల సామర్థ్యం గురువుకి ఉంది. గురువు తలచుకుంటే పామరులను పండితులుగా, శ్రామికుడ్ని పారిశ్రామికవేత్తగా, కార్మికుడ్ని కర్మాగారంగా, ఊరి మీద తిరిగే వాళ్ళని ఉత్తములుగా, సామాన్యుడిని అసామాన్యుడిగా ఇలా తమ దగ్గర పాఠాలు నేర్చుకునే వారి జీవితాలకి బంగారు బాట వేస్తారు. అలాంటి గురువులను పూజించుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఏపీ ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో రాష్ట్రంలో పలు చోట్ల ఉత్తమ విద్యను అందించి, విద్యార్థుల భవిష్యత్తును చక్కగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను ఎంపిక చేసి అవార్డులను అందజేశారు. స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ అవార్డులను ప్రధానం చేశారు. ప్రకాశం జిల్లా మొత్తంలో ఒకే ఒక మహిళ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రకాశం జిల్లాకే ఏకైక ఉత్తమ ఉపాధ్యాయురాలు అంటూ ఆమెను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో స్థానిక ఎంపీయూపీ పాఠశాలలో హెడ్ మాస్టర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ బీబీకి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు దక్కింది.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ప్రశంసా పత్రాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందుకున్నారు. హెచ్ఎం మేడమ్ కి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు రావడం పట్ల పాఠశాల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తమ మేడం.. తన సొంత ఖర్చులతో పాఠశాలను అభివృద్ధి చేశారని, మేడంకి ఇలాంటి అవార్డులు ఇంకా రావాలని కోరుకుంటున్నట్లు ఒక విద్యార్ధి తెలిపాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు దక్కించుకున్న షేక్ బీబీ మేడమ్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.