విశాఖ జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో ఇద్దరు అధికారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. డిప్యూటీ కమిషనర్ పుష్పవర్థన్ మీద అసిస్టెంట్ కమిషనర్ శాంతి ఇసుక పోశారు. పుష్పవర్థన్ నెలరోజుల క్రితం తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ మీద వచ్చారు. తనను వేధించారని తన ఉసురు తగులుతుందంటూ అసిస్టెంట్ కమిషనర్ శాంతి శాపనార్థాలు పెట్టారు. ఈ ఘటనపై ఎవరికి వారు వారి వాదనలు వినిపిస్తున్నారు. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో అన్యాక్రాంతమైన భూములను తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ చేపట్టారు. ఆ భూముల వ్యవహారంలో కిందిస్థాయి సిబ్బంది మీద పలుమార్లు పుష్పవర్థన్ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది.
అధికారుల ఉదాసీనతను పుష్ఫవర్థన్ ప్రశ్నించడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. విశాఖ దేవాదాయ శాఖలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. వివాదాలు దుమ్మెత్తి పోసుకునే వరకూ వెళ్లాయి. డిప్యూటీ కమిషనర్ వేధింపులతో అసిస్టెంట్ కమిషనర్ శాంతి కన్నీటి పర్యంతమయ్యారు. తనను మానసికంగా తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
గతంలో ఉన్న వ్యక్తిగత కక్షలను మనసులో పెట్టుకుని తనను డిప్యూటీ కమిషనర్ పుష్పవర్ధన్ సాధిస్తున్నారన్నారు. అసిస్టెంట్ కమిషనర్ శాంతి చర్యలతో నిర్ఘాంతపోయిన పుష్ప వర్థన్ ఘటనమీద ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కార్యాలయానికిి విజిలెన్స్ సిబ్బంది చేరుకుని మొత్తం వ్యవహారం మీద విచారణ చేపట్టారు.