మురికి కాల్వలోని వ్యర్థాలను తింటూ, అందులోనే పొర్లుతూ ఉంటాయి పందులు. వాటిని చూసినప్పుడల్లా ఒకింత చిరాకు వస్తుంటుంది. అలాగే అవి దురద వచ్చినప్పుడల్లా గోడలకు బరబరా గీకుతూ.. పెద్ద మూతి వేసుకుని అటు, ఇటు తిరుగుతూ ఉంటాయి. అయితే తమ పందులు అమ్ముకున్నాడని గవర్నర్ కు ఫిర్యాదు చేశారు కొందరు. వినడానికి వింతగా అనిపించినా నిజం.
గ్రామాల్లో, ఊర్లలో, పట్టణాల్లో మురికి కాలువలు ఉంటాయి. అయితే ఆ మురికి కాల్వలో ప్రతి చోట పందులు కనిపిస్తుంటాయి. కాల్వలోని వ్యర్థాలను తింటూ, అందులోనే పొర్లుతూ ఉంటాయి. వాటిని చూసినప్పుడల్లా ఒకింత చిరాకు వస్తుంటుంది. అలాగే అవి దురద వచ్చినప్పుడల్లా గోడలకు బరబరా గీకుతూ.. పెద్ద మూతి వేసుకుని అటు, ఇటు తిరుగుతూ ఉంటాయి. ఇంట్లో కూడా ఎవరైనా అలా చేస్తే.. వారిని ఉద్దేశించి పంది అని కూడా తిడుతుంటారు. వీటి వల్ల మెదడు వ్యాపి వ్యాధి సోకుతుందని భావించి, వాటిని తరిమేందుకు కూడా దగ్గరకు వెళ్లరు. అలాగే దూరదర్శన్ వంటి ఒక్కటే చానల్ ఉన్న సమయంలో పందుల పెంపకం వంటి ప్రోగ్రామ్స్ వేసేవారు. అప్పుడు ఏంటీ రా బాబు ఈ ఖర్మ అనుకునే ఉంటారు. మరీ ఇప్పుడు ఎందుకు ఈ పందుల పురాణం అనుకుంటున్నారా.. అయితే చెబుతానుండండీ.
మా పందులను పట్టుకెళ్లారంటూ వాటి పెంపకం దారులు ఏకంగా రాష్ట్ర గవర్నర్‌కు లేఖ రాశారు. వినడానికే వింతగా అనిపించిన ఇది నిజం. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. మనకంటే పందులు అనగానే చిర్రాకు వస్తుంది కానీ, వీటి మీద ఆధారపడి, వాటిని అమ్ముకుని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వినుకొండలో ఎక్కువ పందులు తిరుగుతున్నాయని, వాటి వల్ల రోగాలొస్తున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో స్పందించిన కమీషనర్ వాటిని పట్టుకోవాలని ఆదేశించాడు. ఇంకేముందీ మున్సిపాలిటీ అధికారులు రంగంలోకి దిగి.. వాటిని వల వేసి పట్టుకోవడం ఆరంభించారు. అయితే పందులను తీసుకెళ్లడంతో ఆగ్రహించిన వాటి పెంపకం దారులు ఏకంగా కమీషనర్‌పై ఆరోపణలు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు లేఖ రాశారు.
వినుకొండ కమీషనర్ శ్రీనివాస్ కమిషన్ తీసుకుని తమ పందులను పట్టేలా చేసి, మరో చోటుకు తీసుకుపోయి అమ్ముకున్నాడంటూ పందుల పెంపకం దారులు ఆరోపణలు చేస్తూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ పందులు 20 లక్షల వరకు ఉంటాయని చెప్పడం గమనార్హం. తమకు న్యాయం చేయాలని, తాము పందులు పెంచుకునేందుకు రెండు ఎకరాల భూమినివ్వాలని, అలాగే పోయిన పందులకు ఎంతో కొంత చెల్లించాలని వారంతా వేడుకున్నారు. ఈ లేఖను చదివిన గవర్నర్.. ఎంక్వైరీ చేసి రిపోర్టు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారట. కలెక్టర్.. డిప్యూటీ కలెక్టర్ శ్రీరాములకు ఆ పని అప్పగించారట. ఇరు వాదనలు విన్న ఆయన రిపోర్టు తయారు చేశాడట. ఇక రేపో, మాపో కలెక్టర్ చేరి.. అటు నుండి గవర్నర్‌కు అందే అవకాశాలున్నాయి.