ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన వికేంద్రీకరణ, మూడు రాజధానులకు ప్రజల నుంచి పెద్దఎత్తున మద్దతు లభిస్తోందని మంత్రులు, నేతలు వెల్లడించారు. విశాఖకు రాజధాని సాధనే లక్ష్యంగా మేధావులు, జర్నలిస్టులు, ఉత్తరాంధ్ర ప్రముఖులు అంతా కలిసి జేఏసీగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ జేఏసీ ఆధ్వర్యంలో ఈ అక్టోబర్ 15న ‘విశాఖ గర్జన’ పేరుతో ర్యాలీకి తలపెట్టారు. మరోవైపు అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలంటూ చేపట్టిన అమరావతి మహా పాదయాత్రకు తణుకులోనూ నిరసన సెగ తగిలింది. టీడీపీ బినామీలు రైతుల పేరిట చేస్తున్న పాదయాత్ర అంటూ వైసీపీ శ్రేణులు, నేతలు కొట్టిపారేస్తున్నారు. ప్రజలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం వికేంద్రీకరణే కోరుకుంటున్నారంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ పునరుద్ఘాటించారు.
“మన విశాఖ మన రాజధాని లక్ష్యంగా విశాఖ గర్జన నిర్వహించనున్నాం. టీడీపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు మాత్రం వికేంద్రీకరణే కోరుకుంటున్నారు. విశాఖ, రాయలసీమపై చంద్రబాబు కక్ష గట్టారు. అందుకే మహా పాదయాత్ర పేరుతో దండయాత్రకు ఉసిగోలుపుతున్నారు. అందుకే ఉత్తరాంధ్ర మేధావులంతా జేఏసీగా ఏర్పడ్డారు. భావితరాల భవిష్యత్తు కోసం జేఏసీ తలపెట్టిన ఈ విశాఖ గర్జనను ప్రజలు జయప్రదం చేయాలి” అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా అక్టోబర్ 15న ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో విశాఖ గర్జనకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు.