అమరావతినే ఏకైక రాజధాని చేయాలంటూ రైతులు పాదయాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. మూడు రాజధానులు, వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ శ్రేణులు సైతం తమ గళాన్ని వినిపిస్తున్నాయి. వైసీపీ వర్గాలు సైతం ర్యాలీలు చేస్తున్నాయి. అక్టోబర్ 15న విశాఖలో మహా గర్జన నిర్వహించనున్న విషయం తెలిసిందే. అమరావతి రైతుల పాదయాత్ర ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా చేరుకుంది. అక్కడ అమరావతి రైతుల పాదయాత్రకు రెండోరోజు సైతం నిరసన సెగ తప్పలేదు. మొదటిరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడిలో అమరావతి రైతులకు స్థానికులు తమ నిరసన తెలియజేశారు. ఒకే రాజధాని అంటూ టీడీపీ నేతలు, మూడు రాజధానులు అంటూ వైసీపీ శ్రేణులు పోటాపోటీ నినాదాలు చేశారు.
ఇప్పుడు రెండోరోజు సైతం అమరావతి రైతులకు నిరసన తప్పలేదు. తణుకులో పాదయాత్రకు వ్యతిరేకంగా అడుగడుగునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రైతులుగా చెప్పుకుంటున్న టీడీపీ బినామీలు ఈ పాదయాత్ర చేస్తున్నారంటూ ఆరోపించారు. టీడీపీ బినామీలు గోబ్యాక్.. గోబ్యాక్ అంటూ తమ నిరసన తెలియజేశారు. వికేంద్రీకరణ ముద్దు.. ప్రాంతాల మధ్య చిచ్చు వద్దు అంటూ తణుకు మొత్తం ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే తమకు మూడు రాజధానులే కావాలంటూ ప్రకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా ఈనెల 15న వైజాగ్‌లో ‘విశాఖ గర్జన’ ర్యాలీని చేపట్టనున్నారు. విశాఖలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ఈ ర్యాలీ సాగనుంది. దీనికి మద్దతుగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో ర్యాలీలు నిర్వహించాలంటూ పిలుపునిచ్చారు.