కొన్నేళ్ల ముందు వరకు అదో పేద గ్రామం. అక్కడి ప్రజలు కూలీ పనులు చేసుకుని జీవించేవారు. చాలీ చాలని సంపాదనతో ఓ పూట తిని, ఓ పూట తినక కాలం వెళ్ల దీసే వారు. కానీ, ఓ వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆ ఊరు భవిష్యత్తే మారి పోయింది. పేరులో పల్లె ఉన్నా పట్టణానికి ఏమాత్రం తీసిపోని అభివృద్ది సాధించింది. ఏకంగా ఆ ఊరు వార్తల్లో నిలిచే స్థాయికి వెళ్లింది. ఆ ఊరే ఖాదర్‌పల్లె.
నాడు కూలీలు.. నేడు గల్ఫ్‌లో ఉద్యోగస్తులు!
ఖాదరపల్లె గ్రామం ఉమ్మడి కడప జిల్లాలోని చాపాడు మండలంలో ఉంది. ప్రస్తుతం ఈ గ్రామలో 540 కుటుంబాలు ఉన్నాయి. వీరిలో 90 శాతం ముస్లింలే ఉన్నారు. 1980కి ముందు వరకు ఈ గ్రామంలో పేదరికం నిండా ఉండేది. చాలా మంది దినసరి కూలీలుగా పని చేసుకునేవారు. చాలీచాలని డబ్బులతో చాలా ఇబ్బంది పడుతూ ఉండేవారు. సరైన ఉపాది పనులు లేకపోవటంతో చాలా కష్టాలు ఎదుర్కొనే వారు. అలాంటి వారి జీవితాల్లో ఓ వ్యక్తి కారణంగా మార్పు మొదలైంది. ఊరి దశే మారిపోయింది.
ఊరి భవిష్యత్తును మార్చిన ఆ ఒక్కడు!
1978లో ఖాదర్ పల్లెకు చెందిన మహమ్మద్ దౌలా ఉపాధి కోసం బొంబాయి వెళ్లాడు. అక్కడినుంచి కువైట్‌కు వెళ్లాడు. ఆ ఊరిలో గల్ఫ్ వెళ్లిన మొదటి వ్యక్తి ఆయనే కావటం విశేషం. ఆయనను స్ఫూర్తి తీసుకుని చాలా మంది గల్ఫ్ దేశాలకు వెళ్లటం మొదలుపెట్టారు. ఒక్కడితో మొదలైన ప్రయాణం ఇప్పుడు వందలకు చేరింది. ఆ ఊరిలో ఇప్పుడు 300 మంది గల్ఫ్ దేశాలకు వెళ్లారు. తమ చదువుకు తగ్గ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరిలో కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. చేసే పనిని బట్టి 20 వేల నుంచి 2 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్న వారు కూడా ఉన్నారు.
ఎక్కడ ఉన్నా వారంతా ఒక్కటే..
గల్ఫ్ దేశాలకు వెళ్లినా సొంత గ్రామంపై.. తోటి ఊరి ప్రజలపై మమకారం ఏ మాత్రం తగ్గటం లేదు. గల్ఫ్‌లో ఉన్నా కూడా ఊరి బాగుకోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఊరి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. అంతేకాదు! గ్రామంలో మసీదు నిర్మాణం కోసం ముస్లిం సోదరులంతా కలిసి కోటి రూపాయలు సేకరించారు. అద్భుతమైన మసీదును నిర్మించుకున్నారు. ఇక, గల్ఫ్ దేశాల్లో ఉన్న ఊరు వారంతా సోదరుల్లా కలిసి మెలిసి ఉంటారు. ఎంతో ఆప్యాయంగా జీవితాలను గడుపుతుంటారు. మరి, పట్టణాన్ని తలపించే ఖాదర్‌పల్లెపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.