ఆర్టీసీ ప్రజలను ఆకర్షితులను చేయుటకు ప్రజలకు చాలా ఆఫర్లు పెడుతుంది. సంస్థకు లాభాలను చేకూర్చే క్రమంలో అనేక మార్పులు చేస్తుంది. అందులో భాగంగానే మరో సరికొత్త నిర్ణయం తీసుకుంది.
ప్రజలకు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు బస్సు ప్రయాణం ఉత్తమం. ప్రజలకు అతి చేరువలో సేవలు అందించేందుకు ముందుకు వస్తుంది ఆర్టీసీ. పండుగల సమయాల్లో చాలామంది దూర ప్రయాణాల నేపథ్యంలో ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు. ప్రైవేటు బస్సులు తమ ఇష్టానుసారంగా టికెట్ రేట్లు పెంచుతుంటారు. ఉన్న రేటుకంటె డబల్ రేటు వసూలు చేస్తారు. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా ఆర్టీసీ సంస్థను అభివృద్ధి చేయుటకు, సంస్థకు లాభాలను చేకూర్చేందుకు మరో సంచలన నిర్ణయం తీసుకుంది ఏపీ ఆర్టీసీ. ప్రయాణికుల సౌకర్యార్థం తమ సంస్థ 1500 కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు నిర్ణయించిందని ఏపీ ఆర్టీసీ కడప జోన్ ఈడీ గిడుగు వేంకటేశ్వరరావు తెలిపారు. పీలేరు డిపో కార్యాలయం, బస్టాండ్ ప్రాంగణాన్ని ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థకు కొనుగోలు చేసే 1500 కొత్త బస్సుల్లో కడప జోన్‌కు 800 బస్సులు వస్తాయని.. ఎనిమిది జిల్లాల్లో విస్తరించి ఉన్న కడప జోన్‌లోని 42 బస్టాండ్ల నిర్వహణకు, మరమ్మతుల కోసం రూ. 2 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు. కడప జోన్ పరిధిలోని పలు డీఎంల నుండి బస్టాండుల మరమ్మతుల కోసం ఫిర్యాదులు వచ్చాయని ఇంజనీరింగ్ సిబ్బంది అధ్యయనం మేరకు 42 బస్టాండ్లలో మరమ్మతులను గుర్తించామని అన్నారు. త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
వివిధ కారణాల వల్ల ప్రతినెలా తమ సంస్థకు రూ. 30 కోట్ల వరకు నష్టం వస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది, కార్మికుల కృషితో సమస్యలను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. గత సంవత్సరం సంస్థ రూ. 161 కోట్ల నష్టంలో ఉంటే దానిని ఈ ఏడాది కేవలం రూ. 61 కోట్లకు పరిమితి చేశామని తెలిపారు. సంస్థలోని సిబ్బంది సమస్యలను పరిష్కారం కోసం ప్రతి నెల మూడవ శుక్రవారం ప్రత్యేకంగా గ్రీవెన్స్‌డే ఏర్పాటు చేశామన్నారు.