కడప జిల్లాకు చెందిన నూరీ పర్వీన్ కరోనా సమయంలోనూ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితంగా మారిపోయింది.
వైద్యోనారాయణో హరి అన్నారు పెద్దలు. అంటే దానర్థం.. వైద్యుడు దేవుడితో సమానం అని. అయితే, నేటి సమాజంలో వైద్యం వ్యాపారం అయిపోయింది. కొన్ని కార్పోరేట్ వైద్య శాలలు వైద్యం పేరుతో సామాన్య ప్రజల్ని దోచేస్తున్నాయి. అటు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లలేక.. ఇటు కార్పోరేట్ ఆస్పత్రుకూ వెళ్లలేక జనం అల్లాడిపోతున్నారు. అలాంటి ఈ సమయంలో ఎడారిలో ఒయాసిస్సులా కొంతమంది డాక్టర్లు పేదల పాలిట దేవుళ్లుగా మారిపోతున్నారు. అతి తక్కువ ఫీజుతో వైద్యం చేస్తూ అందరితో జేజేలు కొట్టించుకుంటున్నారు. అలాంటి వారిలో కడప జిల్లాకు చెందిన నూరీ పర్వీన్ ఒకరు. ఆమె పది రూపాయలకే గత కొన్నేళ్లుగా వైద్యం చేస్తున్నారు.
వైద్య వృత్తికి సైతం వన్నే తెస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కడపకు చెందిన నూరీ పర్వీన్ కడపలోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. ఆ తర్వాత కడపలోనే ప్రాక్టీస్ పెట్టారు. పాత బస్టాండ్ సమీపంలో పాత బస్తీల పిల్లలకు సేవలు అందిస్తున్నారు. తాజాగా, ఆమె ఓ ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ గవర్నమెంట్ హాస్పిటల్స్‌కు వెళ్లడానికి మనం ఇష్టపడము. ఎందుకంటే అక్కడ సరైన సౌకర్యాలు ఉండవు. కార్పోరేట్‌కు వెళ్లాలంటే భయపడతాము. చాలా మంది అర్హతలేని డాక్టర్ల దగ్గరికి వెళుతున్నారు.
స్టెరాయిడ్స్ మెడిసిన్స్ తీసుకుని ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ ఉన్నారు. నేను ఎంబీబీఎస్ అయి.. వాళ్లకు అందుబాటులో ఉంటే ఓపీ ఫీజు తగ్గించగలను అనుకున్నాను. నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. మనకు ఎక్కడ కంఫర్ట్ ఉంటే అక్కడ ఉండాలి. నేను కంఫర్ట్ ఉన్న చోట ఉంటాను. నేను ఇక్కడికి వచ్చాక ప్రజలు నాకు బాగా కనెక్ట్ అయిపోయారు. నన్ను నేను ప్రూవ్ చేసుకోవటానికి ఇక్కడ ఉండిపోయా. క్లీనిక్ పెడితే ఒకేచోట ఆగిపోతానని భయపడ్డాను. కానీ, కార్పోరేట్ అంటే వీరికి భయం పోగొట్టాలని క్లినిక్ పెట్టాను. ఇప్పుడు దీంతో కూడా ఆగాలనుకోవటం లేదు. భవిష్యత్తులో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి,
అక్కడ కూడా పది రూపాయలకే పేదలకు మెరుగైన వైద్యం అందించాలనుకుంటున్నా. తర్వాత పీజీ సైకియాట్రీ చేయాలని ఉంది. నేను క్లినిక్ పెట్టినపుడు మా నాన్నకు చెప్పలేదు. సక్సెస్ అయ్యాక చెప్పాను. నా వల్ల ఒకరికైనా మంచి జరిగితే చాలు. పుట్టామా? చచ్చామా కాదు. లైఫ్‌లో ఏదైనా సాధించామా అని ఉండాలి. చిన్నప్పటినుంచి నా గోల్ ఇదే. నేను బుక్స్ చదువుతుంటే నా పేరు ఎప్పుడు వస్తుందా అని. అదే నాగోల్’’ అని అన్నారు. మరి, పది రూపాయలకే వైద్యం అందిస్తున్న నూరీ పర్వీన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.