మహాశివరాత్రి బందోబస్తు విధుల్లో ఉన్న ఓ మహిళ ఎస్సై తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని చేరదీసి మాతృత్వం చూపారు. చూపులకే కాఠిన్యం కానీ మది నిండా మాతృత్వం ఉందని ఆమె నిరూపించారు.
సాధారణంగా పోలీసులపై ప్రజల్లో ఓ రకమైన భావన ఉంటుంది. విధుల్లో భాగంగా ప్రజలపై పోలీసులు కాఠిన్యం ప్రదర్శిస్తుంటారు. దీంతో పోలీసులకు మనస్సు ఉండదని, దారుణంగా ప్రవర్తిస్తారని చాలామంది అభిప్రాయ పడుతుంటారు. అయితే తాముపైకి మాత్రమే కాఠిన్యంగా ఉంటామని, తమకు మనస్సు ఉంటుందని పలు ఘటనలతో పోలీసులు చాటుకున్నారు. ఇటీవలే ఏపీ, తెలంగాణ రాష్ట్రలో జరిగిన కానిస్టేబుల్ పరీక్షల్లో మహిళ అభ్యర్థులు తమ బిడ్డలతో పరీక్ష కేంద్రానికి వచ్చారు. వారి బిడ్డలను అక్కడే ఉన్న పోలీసుల చేరదీసి.. పరీక్ష పూర్తయ్యే వరకు చూసుకున్నారు. ఇలా అనేక సందర్భాల్లో పోలీసుల మంచి మనస్సు కనిపించింది. తాజాగా మహాశివరాత్రి జాతరలో తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని మహిళ ఎస్సై చేరదీసింది. మాతృత్వం చూపుతూ ఆ బిడ్డను నిద్రబుచ్చింది. ఆ మహిళ ఎస్సై చేసిన పనికి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలంలోని మిట్టపాలెం నారాయణ స్వామి ఆలయంలో శనివారం మహాశివరాత్రి పూజలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పండగ సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. హనుమంతునిపాడు ఎస్సై జి.కృష్ణపావని కూడా ఈ బందోబస్తు విధులుకు వచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఆలయ ప్రాంగణంలో ఓ మూడేళ్ల బాలుడు తప్పిపోయి.. ఏడుస్తూ కనిపించాడు. అక్కడే విధుల్లో ఉన్న కృష్ణ పావని ఆ బాలుడిని గుర్తించారు. ఏడుస్తున్న బాలుడి వద్దకు వెళ్లి.. అక్కున చేర్చుకున్నారు. మాటలు కూడా రాని ఆ చిన్నారిని తన ఒడిలోకి తీసుకుని ఓదార్చారు. అమ్మలా లాలించి తన ఒడిలోనే నిద్రబుచ్చారు.
బాలుడి తల్లిదండ్రుల గురించి తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఏట్టకేలకు రాత్రి 1.30 గంటలకు ఆ బాలుడిని… అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. బాలుడి తల్లిదండ్రులు ఎస్సైకి కృతజ్ఞతలు తెలిపారు. అలానే కనిగిరి పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలు తప్పిపోగా.. వారి వివరాలు అడిగి తెలుసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. ఎస్సై కృష్ణపావనిపై స్థానికులు, గుడికి వచ్చిన భక్తులు ప్రశంసలు కురిపించారు. పోలీస్ ఉన్నతాధికారులు ఎస్సై పావనిని అభినందించారు. మరి.. ఈ మహిళ ఎస్సై చేసి ఈ మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.