డ్వాక్రా మహిళలకు శుభవార్త. మహిళా స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు బ్యాంకు లింకేజీ ద్వారా గ్రూపులవారీగా రుణాలు అందిస్తున్న సెర్ప్.. ఇక మీదట వారికి వ్యక్తిగతంగానూ లోన్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. గ్రామాల్లో కొత్తగా కిరాణాషాపులు, ఇతర దుకాణాలు, వ్యాపారాలు నిర్వహించాలనుకునే మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల రుణ సాయం అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన ‘వైఎస్సార్ సీపీ’ ప్రభుత్వం.. ఆ దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో చేపడుతున్న జాతీయ గ్రామీణ జీవనోపాధుల మిషన్ (ఎన్ఆర్ఎల్ఎమ్) కింద ఆర్థిక భరోసా కల్పించి మహిళల అభివృద్ధికి చేయూత ఇవ్వనున్నారు. డ్వాక్రా సంఘాల్లో ఉంటూ.. ఇప్పటికే చిన్న తరహా వ్యాపారాలు చేసుకుంటున్న మహిళలను గుర్తించి వారిని ప్రోత్సహించనున్నారు. వచ్చే నెల నుంచి దీనిని అమల్లోకి తెచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి డ్వాక్రా సంఘం నుంచి కనీసం ఇద్దరు మహిళా వ్యాపారులను గుర్తిస్తారు. మొదట వారి వ్యాపారాభివృద్ధికి అవసరమైన వివరాలు నమోదు చేసుకుంటారు. తరువాత వారికి అవసరమైన రుణ సౌకర్యముతో పాటు.. ఎలా పురోగతి సాధించాలన్నా విషయంపై శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
ఇది కూడా చదవండి: Kurnool: కర్నూలు జిల్లాలోని ఆ ప్రాంతంలో పాలు ఉచితంగా ఇస్తారు, అమ్మరు!
ఇందుకుగాను రూ.75 వేల నుంచి రూ.2 లక్షల వరకు రుణంగా ఇస్తారు. ఇప్పటికే ఆయా సంఘాల సభ్యులు రుణం తీసుకొని ఉన్నా అదనంగా అవసరమైన మొత్తాన్ని అందించడం ద్వారా ఆ మహిళల ఆదాయాన్ని పెంచనున్నారు. వీరు చేస్తున్న వ్యాపారం, అందులో సాధిస్తున్న పురోగతిని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఉద్యమి యాప్ లో నమోదు చేస్తారు. ఏడాది పాటు వీరి కార్యకలాపాలను సెర్చ్ అధికారులు పర్యవేక్షిస్తారు. ఎప్పటికప్పుడు అవసరమైన చేయూత అందిస్తారు. తగిన మార్గనిర్దేశం చేసి ఆర్థికాభివృద్ధికి సహకరిస్తారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.